ఎవరు మరణించిన కారణం ఏదో ఒకటి ఉంటుంది. ఎలాంటి కారణాలు తెలియకుండానే మరణించడం ఆ గ్రామంలోని ప్రజలకే కాదు వైద్యాధికార్లకు సవాల్ విసురుతోంది. ఓ అంతుబట్టని వ్యాధి ఓ చిన్న గ్రామంలోని ప్రజలను కబళిస్తోంది. ఒక్కొక్కరిని బలి తీసుకుంటోంది. ఎందుకిలా? అని గ్రామస్థులతో పాటు అధికారులు సైతం తలలు బద్దలు కొట్టుకునే పరిస్థితి ఏర్పడింది. ఛత్తీస్ గఢ్ రాష్ట్రం సుక్మా జిల్లా రెగడగట్ట గ్రామంలో నెలకొన్న పరిస్థితి ఇది. స్థానిక మీడియా కథనాల ప్రకారం గడిచిన ఆరు నెలల్లో ఈ గ్రామంలో 61 మంది మరణించారు. ఈ గ్రామ జనాభా కేవలం 800 మంది. అయితే జిల్లా యంత్రాంగం మాత్రం 50-52 మంది, అది కూడా గత రెండేళ్ల కాలంలో చనిపోయినట్టు చెబుతోంది.
కానీ, ఈ మరణాలకు కారణం ఏంటన్నది తెలియడం లేదు. ఒడిశా, తెలంగాణ రాష్ట్రాల సరిహద్దులకు సమీపంలోనే ఈ గ్రామం ఉంది. గ్రామస్థుల్లోని కాళ్లలో, ఇతర అవయవాల్లో వాపు కనిపిస్తోంది. దీంతో అధికారులు బాధితుల రక్త నమూనాలను పరీక్షల కోసం పంపించే చర్యలు చేపట్టారు. అలాగే, నీరు, భూసార పరీక్షలు కూడా చేస్తున్నారు. ఈ మరణాలకు కిడ్నీ సమస్యలు కారణమేమోనన్న అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు.