దేశ వ్యాప్తంగా వివిధ ప్రధాన నగరాలలో ఇళ్ల ధరలకు రెక్కలొచ్చాయని ఎస్భీఐ బ్యాంకు తన నివేదికలో వెల్లడించింది. మెట్రోలతో పోలిస్తే చిన్న పట్టణాలు, నగరాలలోనే ఇళ్ల ధరలు భారీగా పెరిగాయి. ఎస్‌బీఐ రీసెర్చ్ విడుదల చేసిన రెసిడెన్షియల్ హౌసింగ్‌లో ఎమర్జింగ్ ట్రెండ్స్ స్పెషల్ రిపోర్టులో ఈ విషయం వెల్లడైంది. విశాఖపట్నం(వైజాగ్), గౌహతి, రాయ్‌పూర్, సూరత్, వడోదర, జైపూర్, లక్నో, డెహ్రడూన్ వంటి టైర్ 2 సిటీలతో పాటు, టైర్ 3 నగరమైన కోయంబత్తూరులో ఇళ్ల ధరలలో భారీగా వృద్ధి నమోదైనట్టు తెలిసింది. వర్క్ ఫ్రమ్ హోమ్, ఫ్రీల్యాన్స్ ఉద్యోగాలు పెరగడంతో.. చిన్న పట్టణాలు, నగరాలలో ఇళ్లకు ఎక్కువగా డిమాండ్ వచ్చినట్టు ఎస్‌బీఐ రిపోర్టు తెలిపింది.
హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ(ఎన్‌సీఆర్), కోల్‌కతా, ముంబై, అహ్మదాబాద్, పూణే మెట్రోపాలిటన్ రీజన్‌లను టైర్ 1 సిటీలుగా కేటగిరీ చేయగా.. రాష్ట్ర రాజధానులు, ఇతర అభివృద్ధి చెందుతున్న ప్రాంతాలను టైర్ 2 నగరాలు చెబుతుంటారు. మిగిలిన జిల్లాలను వాటి పట్టణ జనాభా ప్రకారం టైర్ 3, టైర్ 4 నగరాలుగా కేటగిరీ చేస్తారు.
కరోనా తర్వాత చాలా మంది ప్రజల జీవితాల్లో మార్పులు వచ్చాయి. కరోనా మహమ్మారితో వర్క్ ఫ్రమ్ హోమ్ పుట్టుకు వచ్చింది. ప్రస్తుతం కరోనా తగ్గి చాలా మంది ఆఫీసులకు రాగా.. కొందరు ఇంకా వర్క్ ఫ్రమ్ హోమ్ లేదా హైబ్రిడ్ మోడల్‌లోనే వర్క్ చేస్తున్నట్టు ఎస్‌బీఐ రిపోర్టు తెలిపింది. కస్టమర్ల నుంచి డిమాండ్ విధానాలు మారడంతో చాలా మంది బిల్డర్లు కూడా అంతర్జాతీయ స్థాయిలో రెసిడెన్షియల్ ప్రాజెక్టులను డెవలప్ చేస్తున్నారు. టైర్ 2, 3 నగరాలలో ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేసేందుకు స్మార్ట్ సిటీ ప్రాజెక్ట్స్, అమృత్ వంటి ప్రభుత్వ మౌలిక సదుపాయల పథకాలు సాయం చేస్తున్నాయని ఎస్‌బీఐ రిపోర్టు తెలిపింది.
ఎస్‌బీఐ రిపోర్టులోని కీలక విషయాలు ఇలా ఉన్నాయి. గతేడాది మెట్రో నగరాలతో పోలిస్తే చిన్న పట్టణాలు, నగరాలలోనే ఇళ్ల ధరలు భారీగా పెరిగాయి. విశాఖపట్నం, గౌహతి, రాయ్‌పూర్, సూరత్, వడోదర, జైపూర్, లక్నో, డెహ్రడూన్ వంటి టైర్ 2 నగరాలు, టైర్ 3 నగరం కోయంబత్తూర్‌లలో ఇళ్ల ధరలలో భారీగా వృద్ధి నమోదైంది. విశాఖపట్నంలో ఇళ్ల ధరలు 11.3 శాతం పెరిగాయి. అత్యధికంగా రాయ్‌పూర్‌లో 19.1 శాతం ధరలు ఎగిశాయి.