సభలో నిర్మాణాత్మక చర్చలు జరగాల్సి ఉందని భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. చైర్మన్ గా సభ గౌరవం కాపాడడంలో భాగంగా కొన్నిసార్లు కఠినంగా ఉండాల్సి ఉంటుందని వెల్లడించారు. పార్లమెంటరీ ప్రొసీడింగ్స్ అమలులో నిక్కచ్చిగా వ్యవహరించాల్సి ఉంటుందని అన్నారు.
భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పదవీకాలం ఆగస్టు 10తో ముగియనుంది. ఈ నేపథ్యంలో నేడు పార్లమెంటులో వీడ్కోలు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ సహా ఎంపీలు వెంకయ్యనాయుడు ఘనతలను, వ్యక్తిత్వాన్ని కొనియాడారు. వెంకయ్యనాయుడి సమర్థతలను వేనోళ్ల కీర్తించారు. అనంతరం వెంకయ్యనాయుడు మాట్లాడుతూ అందరికీ ధన్యవాదాలు తెలిపారు.
ఈ క్రమంలో ఆయన మాట్లాడుతూ, సభ్యులు సభ గౌరవాన్ని కాపాడాల్సి ఉంటుందని సూచించారు. సభ కార్యకలాపాలను ప్రజలందరూ గమనిస్తుంటారని తెలిపారు.
ఏ పార్టీకి చెందిన సభ్యులపైనా తప్పుడు అభిప్రాయాలు ఉండవని వెంకయ్యనాయుడు స్పష్టం చేశారు. నేతలకు శత్రువులు ఎవరూ ఉండరని, ప్రత్యర్థులే ఉంటారని సూత్రీకరించారు. భారతీయ భాషలన్నింటిని గౌరవించాలని తెలిపారు. అదే సమయంలో ప్రతి ఒక్కరూ మాతృభాషకు ప్రథమ ప్రాధాన్యత ఇవ్వాలని పిలుపునిచ్చారు.