వివిధ వైరస్ లకు చైనా దేశం పుట్టినిల్లుగా మారుతోంది. ఇప్పటికే కరోనా పుట్టినిల్లయిన చైనాలో మరో వైరస్ వెలుగు చూసింది. కోవిడ్ భయం పూర్తిగా తొలగిపోక ముందే.. డ్రాగన్ కంట్రీలో లంగ్యా హెనిపా వైరస్‌ను గుర్తించారు. తూర్పు చైనాలోని హెనాన్, షాన్‌డాంగ్ ప్రావిన్స్‌ల్లో ఇప్పటి వరకూ 35 మంది ఈ వైరస్ బారిన పడినట్లు గుర్తించారు. ఇది జంతువుల నుంచి మనుషులకు వ్యాప్తి చెందుతుందని.. జ్వరంతో బాధపడుతున్న పేషెంట్ల గొంతు నుంచి సేకరించిన నమూనాల్లో లంగ్యా వైరస్‌ను గుర్తించినట్లు చైనా అధికారిక మీడియా ప్రకటించింది.
ఈ వైరస్ ఇన్ఫెక్షన్ తీవ్రమైన మనుషులు ప్రాణాలను తీయగలదు. కానీ తాజాగా ఈ వైరస్ బారిన పడిన వారిలో స్వల్ప లక్షణాలు కనిపిస్తున్నాయి. పేషెంట్లు ఫ్లూ లాంటి లక్షణాలతో బాధపడుతున్నారు. లంగ్యా వైరస్‌కు ఇప్పటి వరకూ వ్యాక్సిన్ అందుబాటులో లేదు. దాని లక్షణాల ఆధారంగా, సమస్యలను బట్టి చికిత్స అందిన్నారు. ఈ వైరస్ కేసులు, వ్యాప్తిని గుర్తించడం కోసం తైవాన్ న్యూక్లిక్ యాసిడ్ టెస్టులు చేపడుతోంది.
లంగ్యా వైరస్‌ను మొదటిసారిగా 2019లో మనుషుల్లో గుర్తించారు. కానీ ఈ వైరస్ కేసులు ఎక్కువగా ఈ ఏడాదే నమోదవుతున్నాయి. ఈ వైస్ ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి చెందుతుందా లేదా అనే విషయాన్ని తెలుసుకోవడానికి చైనీస్ నిపుణులు ప్రయత్నిస్తున్నారు. కరోనా ప్రభావం కనిపించిన 2020 జనవరి-జులై నెలల మధ్యలో లంగ్యా వైరస్ ఇన్ఫెక్షన్లు కనిపించలేదని బీజింగ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మైక్రోబయాలజీ అండ్ ఎపిడెమియాలజీ పరిశోధకులు వెల్లడించారు. కానీ ఆ ఏడాది జులై తర్వాత 11 లంగ్యా వైరస్ కేసులను గుర్తించారు. ఈ వైరస్ బారిన పడిన వారిలో లక్షణాలను గమనించిన పరిశోధకులు.. ఎక్కువ మంది జ్వరం బారిన పడినట్లు గుర్తించారు. లంగ్యా వైరస్ బారిన పడిన 50 శాతం మందిలో దగ్గు, 54 శాతం మందిలో అలసట, సగం మందిలో ఆకలి లేకపోవడం, 46 శాతం మందిలో కండరాల నొప్పులు, 38 శాతం మందిలో వాంతికి వచ్చినట్లు ఉండటం లాంటి లక్షణాలను గుర్తించారు. హెనాన్, షాన్‌డాంగ్ ప్రావిన్సుల్లోని ఎలుకల్లా ఉండే 262 ష్రూస్ అనే క్షీరదాలను పరీక్షించగా.. 71 ష్రూస్‌ల్లో ఈ వైరస్‌ను చైనా పరిశోధకులు గుర్తించారు. కుక్కలు, మేకల్లోనూ ఈ వైరస్‌ను గుర్తించారు. లంగ్యా వైరస్ కూడా గబ్బిలాల్లో కనిపించే ప్రమాదకర నిఫా వైరస్ కుటుంబానికి చెందుతుంది. నిఫా వైరస్ కోవిడ్ తరహాలోనే వ్యాప్తి చెందుతుంది. నిఫా ప్రమాదకర వైరస్‌గా.. ఇది మరో కరోనా ముప్పుగా పరిణమించే అవకాశం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనా వేసింది.