తన మరణానంతరం అవయవ దానం చేయాలని సీనియర్ నటి మీనా కీలక నిర్ణయం తీసుకొన్నారు. తన అవయవాలను దానం చేస్తున్నట్టు ఆమె స్వయంగా ప్రకటించారు. ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ప్రకటించారు. అవయవదానం అనేది చాలా గొప్ప విషయమని పేర్కొన్నారు. దీర్ఘకాలంగా అనారోగ్యంతో పోరాడుతూ మంచానికే పరిమితమైన వారికి అవయవదానం ద్వారా రెండో జీవితం లభిస్తుందన్నారు. ఒక్క అవయవదాత ముందుకొస్తే 8 మంది ప్రాణాలు నిలుస్తాయన్నారు. అవయవదానం ప్రాముఖ్యాన్ని ప్రతి ఒక్కరు గుర్తించాలని కోరారు.
ఇదిలావుంటే ఆరేళ్ల వయసులోనే సినిమా రంగంలోకి వచ్చిన మీనా ఎంతోమంది ప్రముఖులతో కలిసి నటించారు. మొత్తంగా 90 సినిమాల్లో నటించారు. ఇటీవలే తన భర్తను కోల్పోయిన మీనా.. ఆ లోటు తీరనిదని ఆవేదన వ్యక్తం చేశారు. అనారోగ్యంతో బాధపడుతూ ఆసుపత్రిలో చేరిన మీనా భర్త విద్యాసాగర్‌కు సరైన సమయంలో ఊపిరితిత్తులు దొరక్క మరణించడంతోనే మీనా ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. అవయవదానానికి ముందుకొచ్చిన మీనాపై సర్వత్ర ప్రశంసలు కురుస్తున్నాయి.