ప్రజారోగ్యానికి పెద్ద ఎత్తున నిధులు వెచ్చించి ప్రభుత్వాస్పత్రుల్లో అన్ని మౌలిక సదుపాయాలు, సిబ్బందిని సమకూర్చిన రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్యశ్రీలోకి మరిన్ని ప్రొసీజర్లను చేర్చడం ద్వారా మరింత మెరుగైన వైద్య చికిత్సలు అందించేందుకు సన్నద్ధమైంది. జిల్లాల్లో వైద్య ఆరోగ్య శాఖ కార్యకలాపాల నిర్వహణలో ప్రభుత్వ మెడికల్ కాలేజీలు కీలకం కానున్నాయి.
ఈమేరకు బుధవారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో వైద్య, ఆరోగ్య శాఖపై నిర్వహించిన ఉన్నత సమీక్షలో ముఖ్యమంత్రి జగన్ పలు అంశాలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. పార్వతీపురం మన్యం జిల్లాలోనూ వైద్య కళాశాల ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.