ట్రెండింగ్
Epaper    English    தமிழ்

‘RX100’ సినిమా రివ్యూ

cinema |   | Published : Thu, Jul 12, 2018, 04:43 PM

తెలుగులో ఇప్పటి వరకు లెక్కలేనన్ని ప్రేమకథా చిత్రాలు వచ్చాయి. వాటిలో కొత్తగా, కొంచెం వెరైటీగా ఉన్న చాలా సినిమాలు ప్రేక్షకుల మన్ననలు పొందాయి. ‘తొలిప్రేమ’, ‘ఇడియట్’, ‘ఆర్య’, ‘అర్జున్ రెడ్డి’ లాంటి ప్రేమకథలు యువతకు బాగా నచ్చేశాయి. కానీ ఈ ‘RX100’ వీటన్నికన్నా భిన్నమైనది. శృతిమించే శృంగారం, భయపెట్టే హింస, మనసును హత్తుకునే అందమైన పాటలు.. అవే ఈ సినిమాపై అంచనాలు పెంచేశాయి. హీరోహీరోయిన్లు కొత్త వాళ్లే అయినా ప్రేక్షకుడి దృష్టిని తన వైపు తిప్పుకుంది ఈ ‘RX100’. ఇంతకీ సినిమా ఎలా ఉంది.. చూద్దాం.. 


శివ (కార్తికేయ)కు తల్లిదండ్రులు లేరు. అతన్ని డాడీ (రాంకీ) పెంచి పెద్ద చేస్తాడు. విశ్వనాథం (రావు రమేష్) ఊళ్లో పెద్ద మనిషి. జిల్లా స్థాయి రాజకీయ నాయకుడు కూడా. అతని కూతురు ఇందు (పాయల్) బెంగళూరులో ఇంజినీరింగ్ పూర్తి చేస్తుంది. సెలవులకు ఇంటికొచ్చిన ఇందు.. ఒక రోజు శివను చూస్తుంది. తొలి చూపులోనే అతన్ని ఇష్టపడుతుంది. ఇందుకు కొంచెం చొరవ ఎక్కువ. అందుకే అస్సలు ఆలస్యం చేయకుండా తన ప్రేమను శివకు చెప్పేస్తుంది. తనతో పెళ్లికి ముందే అన్నీ కానిచ్చేస్తుంది. కానీ అనుకోకుండా ఇందుకు అమెరికాలో స్థిరపడిన అబ్బాయితో పెళ్లయిపోతుంది. అప్పటి నుంచి మూడేళ్లు అసలు శివకు ఇందు కనిపించదు. ఇందు ఎప్పటికైనా వస్తుందని శివ ఎదురుచూస్తూనే ఉంటాడు. అసలు ఇందు తిరిగి వచ్చిందా..? శివను అంతగా ప్రేమించిన ఇందు వేరే పెళ్లి ఎందుకు చేసుకుంది..? మరి చివరికి శివ ఏమయ్యాడు..? అనే విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే. 


ఎలా ఉందంటే.. 


హీరో హీరోయిన్ ప్రేమించుకోవడం, దానికి హీరోయిన్ తండ్రి ఒప్పుకోకపోవడం, హీరో అతన్ని ఎదిరించి చివరకు ప్రేయసిని దక్కించుకోవడం. చాలా సినిమాల్లో మీరు చూసిన ప్రేమకథలు ఇవే కదా! కానీ ఈ ‘RX100’ వాటికి భిన్నం. ‘యాన్ ఇన్‌క్రెడిబుల్ లవ్ స్టోరీ’ అని ఉపశీర్షిక పెట్టుకున్నందుకు దానికి తగిన న్యాయం చేశారు దర్శకుడు అజయ్ భూపతి. పల్లెటూరి వాతావరణంలో స్వచ్ఛమైన ప్రేమను, ప్రేమ కథను తెరపై ఆవిష్కరించారు. అయితే తన ప్రేమ కోసం హీరో పోరాటం చేస్తున్నప్పుడు ఎదురయ్యే హింసను కూడా బాగా చూపించారు. ఒకానొక దశలో దర్శకుడు భూపతి తన గురువు రాంగోపాల్ వర్మను గుర్తుచేశారు. హీరో హీరోయిన్ల మధ్య రొమాన్స్‌ను చాలా బోల్డ్‌గా చూపించారు. ఇంత గాఢమైన రొమాన్స్‌ను సెన్సార్ బోర్డు సభ్యులు ఎలా అంగీకరించారా అనే అనుమానం కలగకమానదు. 


రొమాంటిక్ సీన్


తొలి భాగం చూస్తున్నంతసేపు ఇది మామూలు సినిమానే అనిపిస్తుంది. కానీ ప్రీ క్లైమాక్స్‌కు వచ్చేసరికి ఏం సినిమారా..! అనకమానరు. సెకండాఫ్‌ను దర్శకుడు అంత బాగా తెరకెక్కించారు. వాస్తవానికి సినిమాను నిలబెట్టే ట్విస్ట్ ఒకటి సెకండాఫ్‌లో వస్తుంది. అదేంటో తెలిస్తే సినిమా చూడాలనే ఆసక్తే పోతుంది. అందుకే దాని గురించి ప్రస్తావించడంలేదు. ఒక నిజజీవిత సంఘటన ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్లు సినిమా ఆఖర్లో తెరపై వేశారు. శివ అనే వ్యక్తి కథ అని ఆయన ఫొటో కూడా చూపించారు. ఈ కథ నిజమా అని తెలుసుకున్న ప్రతి ప్రేక్షకుడి గుండె బరువెక్కక మానదు. సెకండాఫ్ చూసిన తరవాత.. ఫస్టాఫ్‌లో చూపించిన రొమాన్స్ నిజమే కదా అనిపిస్తుంది. ఫస్టాఫ్ ప్రేక్షకుడికి కాస్త బోర్ కొట్టించినా.. సెకండాఫ్ మాత్రం కచ్చితంగా నచ్చుతుంది. ముఖ్యంగా యువతకు మంచి కిక్ ఇచ్చే సినిమా ఇది. 


ఎవరెలా చేశారంటే.. 


ఈ సినిమా ద్వారా కార్తికేయ హీరోగా పరిచయమయ్యారు. హీరోకి ఉండాల్సిన ఫిజిక్, మేనరిజం కార్తికేయలో ఉన్నాయనడంలో ఎలాంటి సందేహం లేదు. శివ పాత్రకు ఆయన కరెక్ట్‌గా సరిపోయారు. నటన కూడా బాగానే ఉంది. తొలి సినిమా కాబట్టి కొన్ని విషయాల్లో మెరుగుపడాల్సి ఉంది. ముఖ్యంగా డైలాగ్ డెలివరీ అంతగా బాగాలేదని చెప్పాలి. ఇక సినిమాలో ప్రధానంగా చెప్పుకోవాల్సింది హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్ గురించి. హిందీ సీరియల్ నటి అయిన పాయల్‌కు తెలుగులో ఇదే తొలి సినిమా. అయినప్పటికీ అద్భుతంగా నటించింది. ముఖ్యంగా రొమాంటిక్ సీన్లలో చంపేసింది. హీరోయిన్ తండ్రి పాత్రలో రావు రమేష్ నటన ఎప్పటిలానే చాలా బాగుంది. రాంకీ కూడా తన పాత్రకు పూర్తి న్యాయం చేశారు. 


 రివ్యూ : 2.5/5


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa