చిరుజల్లు’లో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన ఉదయ్ శంకర్ ‘ఆటకదరా శివ’ మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత ‘మిస్ మ్యాచ్, క్షణ క్షణం’ వంటి సినిమాలోనూ కథానాయకుడిగా నటించాడు.అతని తాజా చిత్రం ‘నచ్చింది గర్ల్ ఫ్రెండూ’. జెన్నీఫర్ ఇమ్మానుయేల్ నాయికగా నటిస్తున్న ఈ మూవీని శ్రీరామ్ ఆర్ట్స్ బ్యానర్ పై అట్లూరి ఆర్ సౌజన్య సమర్పణలో అట్లూరి నారాయణరావు నిర్మించారు. గురుపవన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఇదే నెల 11న జనం ముందుకు రాబోతోంది. ఈ సందర్భంగా ఇటీవల సెన్సార్ కార్యక్రమాలనూ పూర్తి చేశారు.
దీనికి ‘యు/ఎ’ సర్టిఫికెట్ లభించిందని, థ్రిల్లింగ్ లవ్ స్టోరీగా రూపుదిద్దుకున్న ఈ మూవీని సెన్సార్ సభ్యులు అప్రిషియేట్ చేశారని నిర్మాత తెలిపారు. వైజాగ్ నేపథ్యంగా థ్రిల్లర్ ఎలిమెంట్ తో సాగే లవ్ స్టోరి ఇదని, సినిమాలో ఆహ్లాదకరమైన ప్రేమ కథతో పాటు ఆసక్తిని పంచే థ్రిల్లింగ్ అంశాలుండబోతున్నాయని దర్శకుడు గురు పవన్ చెప్పారు. సుమన్, మధునందన్, పృధ్వీరాజ్, శ్రీకాంత్ అయ్యంగార్, సనా, కళ్యాణ్ తదితరులు కీలక పాత్రలు పోషించిన ఈ సినిమాకు గిప్టన్ సంగీతాన్ని సమకూర్చారు.