అజ్ఞాతవాసి (జనవరి 10)
ఈ ఏడాది ఆరంభమే అట్లర్ ఫ్లాఫ్ తో మొదలైంది. అశేష అభిమానులు దైవంగా కొలిచే పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా నటించిన అజ్ఞాతవాసి తొలి రోజు బాహుబలి రికార్డులను బ్రేక్ చేసినా చిత్రంలో విషయం లేకపోవడంతో ఆయన సినీ కెరీర్ లోనే దారుణ పరాజయంగా నిలిచింది. పవన్ ప్రాణ మిత్రుడు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం త్రివిక్రమ్ దర్శకత్వానికే మాయని మచ్చగా నిలిచింది. కథ లేకుండా నేల విడిచి సాము చేయడం ఈ చిత్ర ఫెయిల్యూర్ కు ప్రధాన కారణమైంది. అంతేకాకుండా ఫ్రెంచ్ భాషకు చెందిన లార్గో వించ్ చిత్రాన్ని మక్కీకి మక్కీ త్రివిక్రమ్ కాపీ కొట్టాడని, ఆఖరికి పోస్టర్ల డిజైన్ కూడా ఫ్రెంచ్ చిత్రానికి కాపీగానే ఉన్నాయని సాక్షాత్తూ ఆ ఫ్రెంచ్ చిత్ర దర్శకుడు ఆరోపించాడు. అంతేకాకుండా కోర్టులో దావా కూడా వేయనున్నట్లు ప్రకటించడంతో త్రివిక్రమ్ తన ఇమేజ్ తోపాటు పవన్ ఇమేజ్ ను అథ:పాతాళానికి పడేలా చేశాడని ఇంటాబయటా విమర్శలు వ్యక్తమయ్యాయి.
జైసింహా (జనవరి 12)
నందమూరి బాలకృష్ణ, నయనతార కాంబినేషన్లో కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం కూడా ఫ్లాఫ్ గా నిలిచింది. అయితే రూ.30 కోట్ల లోపు బడ్జెట్ తోనే తెరకెక్కడంతో నష్టాలపాలవకుండా బొటాబొటిన బయటపడింది. ఎన్నో సినిమాల్లో ఎప్పుడో 25, 30 ఏళ్ల కిందటి సినిమాల్లో చూసిన సన్నివేశాలనే అటు తిప్పి.. ఇటు తిప్పి చూపడంతో కొత్తదనం అనేది లేకుండా మూస ధోరణిలో ఉంటూ పరాజయం పాలైంది. కేవలం బాలయ్య అభిమానులను మాత్రమే ఆకట్టుకుంది.
రంగుల రాట్నం (జనవరి 14)
యువ హీరో రాజ్ తరుణ్ హీరోగా అక్కినేని నాగార్జున నిర్మాతగా శ్రీ రజని దర్శకత్వంలో ఎన్నో అంచనాల మధ్య విడుదలైన రంగుల రాట్నం తిరగలేదు. ఇది కూడా ప్రేక్షకుల్ని ఆకట్టుకోలేక యావరేజ్ గా నిలిచింది. హీరోయిన్ చిత్ర శుక్లా, హీరో రాజ్ తరుణ్ మధ్య సన్నివేశాలు పండకపోవడం, హీరోయిన్ డల్ గా కనిపించడం, అనవసరమైన డ్రామా ఈ చిత్రానికి ప్రతిబంధకాలుగా నిలిచాయి.
భాగమతి (జనవరి 26)
అరేబియన్ గుర్రం అనుష్క టైటిల్ రోల్ పోషించిన భాగమతి ఈ ఏడాది తొలి సూపర్ హిట్ గా నిలిచింది. ఈ ఏడాది ఆరంభమే పరాజయాల బాట పట్టిన తెలుగు ఇండస్ట్రీకి భాగమతి ఊపిరి పోసింది. హారర్ చిత్రంలా ఉంటూ చివరికి పొలిటికల్ థ్రిల్లర్ లా చిత్రం ముగుస్తుంది. మరోమారు అనుష్క ఒంటి చేత్తో ఈ సినిమాకు ప్రాణం పోసింది. పిల్ల జమీందార్ ఫేమ్ అశోక్ దర్శకత్వంలో ప్రభాస్ కి సొంత నిర్మాణ సంస్థలాంటి యూవీ క్రియేషన్సు ఈ చిత్రాన్ని నిర్మించి భారీగా లాభాలను ఆర్జించింది.
ఛలో,
టచ్ చేసి చూడు (ఫిబ్రవరి 2)
ఫిబ్రవరిలో యువ కథానాయకుడు నాగశౌర్య హీరోగా నటించిన ‘ఛలో’, మాస్ మహారాజా రవితేజ ‘టచ్ చేసి చూడు’ విడుదలయ్యాయి. వీటిలో సొంత ప్రొడక్షన్ పై వెంకీ కుడుముల దర్శకత్వంలో నాగశౌర్య నిర్మించిన ఛలో సూపర్ హిట్ గా నిలిచింది. మెగాస్టార్ చిరంజీవి ఈ చిత్ర ఆడియో ఫంక్షన్ కు హాజరై సినిమాను ప్రమోట్ చేయడంతో భారీ విజయం సాధించింది. ఇక రవితేజ హీరోగా నటించిన ‘టచ్ చేసి చూడు’ పరాజయం పాలైంది. విక్రమ్ సిరికొండ దర్శకత్వంలో ప్రముఖ నిర్మాత నల్లమలుపు బుజ్జి ఈ చిత్రాన్ని నిర్మించారు. రాశీ ఖన్నా, సీరత్ కపూర్ ఇద్దరూ తమ సోయగాలను, అందాలను ప్రేక్షకులకు వాటంగా వడ్డించినా ప్లాప్ కాకుండా తప్పించలేకపోయారు.
గాయత్రి,
ఇంటెలిజెంట్ (ఫిబ్రవరి 9)
శ్రీ లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ బ్యానర్ పై మంచు మోహన్ బాబు నిర్మించిన గాయత్రి కూడా ప్లాఫ్ గా నిలిచింది. ఇందులో మోహన్ బాబుతోపాటు ఆయన కుమారుడు మంచు విష్ణు, శ్రియా శరణ్ నటించారు. మోహన్ బాబు డైలాగులు మినహా ఈ సినిమాలో కథాకథనాలు లోపించడంతో బాక్సాఫీస్ వద్ద పల్టీ కొట్టింది. ఇక ఫిబ్రవరి 9నే విడుదలైన ‘ఇంటెలిజెంట్’ టైటిల్ ను ఏ మాత్రం జస్టిఫై చేయలేకపోయింది. మెగా మేనల్లుడు, సుప్రీం హీరో సాయిధరమ్ తేజ్, లేలేత సొగసుల లావణ్య త్రిపాఠి హీరో హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం డిజాస్టర్ గా మిగిలింది. ఖైదీ నెంబర్ 150 తో ఇండస్ట్రీ హిట్ కొట్టిన వివి వినాయక్ ఇంటెలిజెంట్ దర్శకుడు.
తొలి ప్రేమ (ఫిబ్రవరి 10)
ఫిదాతో సూపర్ డూపర్ హిట్ కొట్టిన మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా నటించిన తొలి ప్రేమ ఫిబ్రవరి 10న విడుదలై మొదటి షో నుంచే సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. ఢిల్లీ బబ్లీ బ్యూటీ రాశీ ఖన్నా హీరోయిన్ గా నటించిన ఈ చిత్రాన్ని బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మించారు. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కెరీర్లో సూపర్ హిట్ గా నిలిచి ఇప్పటికీ క్లాసిక్ చిత్రంగా నిలిచిన తొలిప్రేమ టైటిల్ నే ఈ చిత్రానికి పెట్టడం ప్లస్ అయ్యింది. దర్శకుడు అట్లూరి వెంకీకి ఇదే తొలి చిత్రం కావడం గమనార్హం.
ఇదీ నా లవ్ స్టోరీ (ఫిబ్రవరి 14)
నువ్వే కావాలి, నువ్వు లేక నేను లేను వంటి సూపర్ హిట్ చిత్రాలతో లవర్ బాయ్ గా ఇమేజ్ సాధించిన తరుణ్ తర్వాత వరుస పరాజయాలతో తెరమరుగై పోయాడు. చాలా కాలం తర్వాత మళ్లీ ‘ఇదీ నా లవ్ స్టోరీ’ సినిమాతో మనల్ని పలకరించినా ఈ సినిమా దారుణ పరాజయంగా మిగిలింది. ఇదే రోజు హీరో నాని నిర్మించిన ‘ఆ’ కూడా రిలీజైంది. అయితే ఆకట్టుకునే కథనం లేకపోవడంతో ప్లాఫ్ గా మిగిలింది. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో కాజల్ అగర్వాల్, నిత్యామీనన్, రెజీనా, ఈషా రెబ్బా వంటివారు నటించినప్పటికీ సినిమా ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేదు. కాకపోతే ఒక మంచి ప్రయత్నంగా విమర్శకుల ప్రశంసలు పొందింది.
మనసుకు నచ్చింది,
సోడా-గోలీసోడా,
రచయిత,
చల్తే చల్తే.. (ఫిబ్రవరి 16)
మనసుకు నచ్చింది, సోడా-గోలీసోడా, రచయత, చల్తే చల్తే.. ఈ నాలుగు చిత్రాలు ఫిబ్రవరి 16న విడుదలయ్యాయి. ఇందులో ‘మనసుకు నచ్చింది’ చిత్రానికి ప్రముఖ సినీ నటుడు కృష్ణ కుమార్తె మంజుల దర్శకత్వం వహించింది. సందీప్ కిషన్, అమైరా దస్తూర్ హీరోహీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం అట్టర్ ప్లాఫ్ గా నిలిచింది. మిగిలిన మూడు చిత్రాలు సోడా-గోలీసోడా, రచయత, చల్తే.. చల్తేల పరిస్థితి కూడా ఇంతే.
హైదరాబాద్ లవ్ స్టోరీ, జువ్వ,
రారా (ఫిబ్రవరి 23)
ఫిబ్రవరి 23న హైదరాబాద్ లవ్ స్టోరీ, జువ్వ, రారా చిత్రాలు విడుదలయ్యాయి. వీటిలో ‘రారా’ చిత్రంలో గత కొన్నేళ్లుగా హిట్లు లేని శ్రీకాంత్ హీరోగా నటించాడు. అయితే ఈ చిత్రం కూడా అతని దురదృష్టాన్ని మార్చలేకపోయింది. హారర్ చిత్రంతోనైనా కనీసం హిట్ కొడదామనుకున్న శ్రీకాంత్ కు మరోసారి అదృష్టం ముఖం చాటేసింది. మిగిలిన రెండు చిత్రాల్లో కొత్తవాళ్లు నటించారు. వీటి పరిస్థితీ దిగదుడుపే.
ఏ మంత్రం వేసావే,
ఐతే 2.0,
దండుపాళ్యం-3 (మార్చి 9)
అర్జున్ రెడ్డి వంటి పాత్ బ్రేకింగ్ మూవీ తర్వాత విజయ్ దేవరకొండ నటించిన ‘ఏ మంత్రం వేశావే’ పరాజయం మూటగట్టుకుంది. మార్చి 9న రిలీజైన ఈ సినిమాకు మర్రి శ్రీధర్ దర్శకత్వం వహించారు. ఇదే రోజు విడుదలైన ఐతే, దండుపాళ్యం-3 కూడా వచ్చినంత వేగంగా వెనక్కిపోయాయి.
కిర్రాక్ పార్టీ,
నెల్లూరు పెద్దారెడ్డి,
వాడేనా (మార్చి 16)
మార్చి 16న విడుదలైన కిర్రాక్ పార్టీ యావరేజ్ గా నిలిచింది. యువనటుడు నిఖిల్ హీరోగా నటించిన ఈ చిత్రానికి శరణ్ కొప్పిశెట్టి దర్శకుడిగా వ్యవహరించాడు. ఇదే రోజు విడుదలైన మిగిలిన రెండు చిత్రాలు వాడేనా, నెల్లూరి పెద్దారెడ్డి ప్లాఫులుగా మిగిలాయి.
నీదీ.. నాదీ ఒకే కథ,
ఎంఎల్ఏ,
రాజరథం (మార్చి 23)
మార్చి 23న ఎంఎల్ఏ, నీది..నాది ఒకే కథ, రాజరథం చిత్రాలు విడుదలయ్యాయి. ఇందులో ‘ఎంఎల్ఏ’ చిత్రంలో నందమూరి కల్యాణ్ రామ్, కాజల్ అగర్వాల్ నటించడంతో చిత్రానికి మంచి హైప్ వచ్చింది. అయితే కథ లోపించడం, సన్నివేశాలు పదుల సంఖ్యలో చూసిన సినిమాల్లోవే కావడంతో సినిమా పల్టీ కొట్టింది. కొత్త దర్శకుడు ఉపేంద్ర మాధవ్ తెరకెక్కించిన ఈ చిత్రం ఏ మాత్రం ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ఇక ఇదే రోజు రిలీజైన ‘నీదీ నాదీ ఒకే కథ’ హిట్ గా నిలిచింది. అప్పట్లో ఒకడుండేవాడు, మెంటల్ మదిలో వంటి సినిమాలతో హిట్లు సాధించిన శ్రీ విష్ణు ఇందులో కథానాయకుడిగా నటించాడు. మంచి కథ, కథనం తోడవడంతో దర్శకుడు వేణు ఉడుగుల తొలి చిత్రమైనా చక్కటి హిట్ కొట్టాడు. ఇక రాజరథం కథ, కథనాలు లేక ఉల్టాపల్టా అయింది. ఈ కన్నడ డబ్బింగ్ చిత్రంపై ఎవరికీ అంచనాలు కూడా లేవు.
రంగస్థలం (మార్చి 30)
ఈ ఏడాది తొలి మూడు నెలల్లో భాగమతి, తొలిప్రేమలను మినహాయించి గట్టి హిట్ పడలేదని దిగులు చెందుతున్న సినీ పరిశ్రమ ఆందోళన పోగొట్టాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. రంగస్థలంలో చెవిడివాడిగా రామ్ చరణ్ నటనకు తెలుగు ప్రేక్షకులు ఫిదా . . సరైన కథ పడితే నెంబర్ వన్ హీరోల రేసులో తానూ ఉన్నానని ఈ చిత్రం ద్వారా రామ్ చరణ్ చాటిచెప్పాడు. సుకుమార్ దర్శకత్వంలో చిట్టి బుగ్గల సుందరి సమంత హీరోయిన్. చిట్టిబాబుగా బాక్సాఫీస్ మీద మెగా పవర్ చూపించాడు రాం చరణ్. సుకుమార్ డైరక్షన్ లో వచ్చిన ఈ సినిమా నాన్ బాహుబలి రికార్డులన్ని క్రాస్ చేసి 125 కోట్ల షేర్ తో రికార్డులు క్రియేట్ చేసింది.
రంగస్థలం తర్వాత నితిన్ ఛలో మోహన్ రంగ, నాని కృష్ణార్జున యుద్ధం బాక్సాఫీస్ పై ప్రభావం చూపించలేదు. ముఖ్యంగా వరుస విజయాలతో దూసుకెళ్తున్న నాని కృష్ణార్జున యుద్ధం మూవీ మాత్రం పెద్ద షాకే ఇచ్చింది.
ఏప్రియల్ 2018
భరత్ ఏప్రిల్ 20
ఇక ఆ తర్వాత ఏప్రిల్ 20న వచ్చిన సినిమా భరత్ అనే నేను. బాధ్యాతాయుతమైన పౌరుడు సిఎం అయితే ఎలా ఉంటుందో చూపించాడు మహేష్. కొరటాల శివ, మహేష్ కాంబోలో వచ్చిన శ్రీమంతుడు హిట్ మేనియా కొనసాగిస్తూ భరత్ అనే నేను కూడా 105 కోట్ల షేర్ తో ఈ ఇయర్ సెకండ్ బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది.
నాగ శౌర్య తెలుగు, తమిళ భాషల్లో చేసిన కణం ప్రేక్షకాదరణ పొందలేదు. మంచు విష్ణు ఆచారి అమెరికా యాత్ర వృధా ప్రయత్నమని తేల్చారు ఆడియెన్స్.
మే 2018
నా పేరు సూర్య ( మే 4న )
మహానటి ( మే 9న )
మే 4న వచ్చిన అల్లు అర్జున్ నా పేరు సూర్య కూడా బన్ని సూపర్ హిట్ క్రేజ్ కు బ్రేక్ వేసింది. వక్కంతం వంశీ డైరక్షన్ లో వచ్చిన ఈ సినిమా డివైడ్ టాక్ తో మొదలై ఫ్లాప్ గా మిగిలింది.
ఇక మే 9న వచ్చిన మహానటి వసూళ్ల సునామి సృష్టించింది. సావిత్రమ్మ జీవిత కథతో వచ్చిన మహానటి నాగ్ అశ్విన్ డైరక్షన్ లో తెరకెక్కింది. కీర్తి సురేష్ సావిత్రిగా అందరిని అలరించింది. ఈ సినిమా ఓవర్సీస్ లో 2.5 మిలియన్ డాలర్లు వసూలు చేసి టాప్ తెలుగు సినిమాల సరసన చేరింది. తెలుగు రాష్ట్రాల్లో కూడా భారీ వసూళ్లను రాబట్టింది. 25 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన మహానటి 30 కోట్ల పైన కలక్షన్స్ రాబట్టి ఈ ఇయర్ బ్లాక్ బస్టర్ మూవీలో ఒకటిగా నిలిచింది.