ఆ నలుగురు లేదా ఆ ఐదుగురు థియేటర్లపై కంచె వేసి ఇండస్ట్రీని నిలిపేస్తున్న వైనంపై ఎప్పటికప్పుడు గొడవ జరుగుతూనే ఉంటుంది. ఎవరో ఒకరు ఏదో ఒక సందర్భంలో వాపోతూనే ఉంటారు. కానీ ఏం లాభం? యథారాజా తథా ప్రజ! అన్న చందంగా దానిని ప్రభుత్వాలే గాలికి వదిలేశాయి. థియేటర్ సిండికేట్ అనేది బిజినెస్ కి సంబంధించిన వ్యవహారంగానే ప్రభుత్వ పెద్దలు భావిస్తారు. ఏపీ- తెలంగాణలో ఇది ఎన్నటికీ తేలని సమస్య. ఈ సంక్రాంతి బరిలో ఏకంగా నాలుగు సినిమాలు పోటీపడుతున్నాయి. ఇందులో రజనీకాంత్ పేట చిత్రానికి థియేటర్లు దొరక్కుండా మిగతా మూడు సినిమాల కోసం కర్చీఫ్ వేసేయడంతో పేట చిత్రం నిర్మాత అశోక్ వల్లభనేని గగ్గోలు పెడుతున్నారు. వీలున్న ప్రతి వేదికపై ఆ నలుగురు అంటూ మండిపడుతున్నారాయన. నా సినిమాని థియేటర్లు ఇవ్వకుండా నలిపేస్తున్నారు. యువి క్రియేషన్స్, అల్లు అరవింద్, దిల్ రాజు.. వీళ్లంతా థియేటర్లతోనే పుట్టినట్టుగా భావిస్తున్నారు. మాకు థియేటర్లు ఇవ్వడానికి వీళ్లకు నొప్పేంటి? వందలాది థియేటర్లలో ఒకే సినిమాని వేసి మంచి సినిమా వచ్చినప్పుడు ఇవ్వకుండా నాటకమాడతారా? .. వీళ్లు వేసే సినిమాలే చూడాలా? వీళ్లు రుద్దేసేవే చూడాలా? ఈ కుక్కలకు బుద్ధి చెబుదాం.. అంటూ వల్లభనేని ఫైరయ్యారు. “కేసీఆర్ ప్రజాభిమానంతో మళ్లీ గెలిచి సీఎం అయ్యారు. ఎవరినో నయీమ్‌ని చంపారు. థియేటర్ల మాఫియాని ఎందుకు షూట్ చేయరు? అని సూటిగా ప్రశ్నించారు. కేసీఆర్, చంద్రబాబు ఇలాంటి వాళ్లను అణగ దొక్కాలని అన్నారు. కేసీఆర్, చంద్రబాబు ఇలాంటి వాళ్లను తొక్కాలి! అని ఘాటుగానే వ్యాఖ్యానించారు వల్లభనేని