అల్లు అర్జున్ మామగారైన కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి అధికార బీఆర్ఎస్ పార్టీ నేతగా ఉన్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండగా ఆయన పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు. ఇందులో భాగంగా పెద్దవూర మండలం కొత్తగూడెం గ్రామంలో 1000 మంది కెపాసిటీతో కూడిన కన్వెన్షన్ హాల్ నిర్మించాడు. దీని ప్రారంభోత్సవానికి అల్లుడు అల్లు అర్జున్ ని ముఖ్య అతిథిగా పిలిచారు. నేడు పెద్దవూర మండలంలో జరగనున్న ఈ కార్యక్రమానికి అల్లు అర్జున్ హాజరయ్యారు. అల్లు అర్జున్ కి ఘన స్వాగతం లభించింది. బీఆర్ఎస్ మంత్రి జగదీశ్ రెడ్డితో పాటు నల్గొండ జిల్లాకు చెందిన పలువురు ఎమ్మెల్యేలు ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి భారీగా ఈ వేడుక నిర్వహిస్తున్నారు. 10000 మందికి భోజన ఏర్పాట్లు చేయడంతో పాటు మహిళలకు చీరల పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేశారు. నాగార్జున సాగర్ నియోజకవర్గం నుండి బీఆర్ఎస్ టికెట్ ఆశిస్తున్న కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి పొలిటికల్ ఈవెంట్స్ లో విరివిగా పాల్గొంటున్నారు.
తన అల్లుడు అల్లు అర్జున్ కన్వెన్షన్ హాల్ ఓపెనింగ్ కి రావడం వలన భారీగా జనాలు తరలివచ్చారు. ఈ క్రమంలో బీఆర్ఎస్ నుండి సీటు పొందే అవకాశాలు మెరుగవుతాయని ఆయన భావిస్తూ ఉండవచ్చు. ఇక గతంలో అల్లు అర్జున్ ఎలాంటి పొలిటికల్ ఈవెంట్స్ లో పాల్గొనలేదు. మొదటిసారి ఆయన బీఆర్ఎస్ నేత చంద్రశేఖర్ రెడ్డి ఏర్పాటు చేసిన ఈవెంట్ కి హాజరయ్యారు. చంద్రశేఖర్ రెడ్డి కుమార్తె అయిన స్నేహారెడ్డిని 2011లో అల్లు అర్జున్ ప్రేమ వివాహం చేసుకున్నారు.