2021లో కోలీవుడ్ స్టార్ కమెడియన్ యోగిబాబు ప్రధాన పాత్రలో వచ్చిన చిత్రం ‘మండేలా’ . గ్రామ ఎన్నికల నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో యోగిబాబు నటనకు మంచి గుర్తింపు లభించింది. అలాగే సినిమా కూడా మంచి విజయం సాధించి.. జాతీయ అవార్డును సైతం గెలుచుకుంది. ఇప్పుడీ సినిమాను తెలుగులో రీమేక్ చేస్తున్నారు. ఈ రీమేక్‌లో నటిస్తుంది ఎవరని అనుకుంటున్నారా? అతి తక్కువ సమయంలో కమెడియన్‌గా గుర్తింపు తెచ్చుకున్న నటులలో సంపూర్ణేష్ బాబు ఒకరు. ఆయన చేసిన సినిమాలలోని ఎన్నో స్ఫూఫ్ సన్నివేశాలు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించాయి. ఇప్పుడాయన ‘మండేలా’ రీమేక్‌లో నటించబోతుండటంతో.. ఒక్కసారిగా సినిమాపై అంచనాలు మొదలయ్యాయి. తాజాగా ఈ రీమేక్‌కి సంబంధించిన చిత్ర వివరాలను మేకర్స్ ప్రకటించారు. ఈ సినిమాకి ‘మార్టిన్ లూథర్ కింగ్’ అనే టైటిల్‌తో పాటు ఫస్ట్ లుక్ పోస్టర్ని కూడా విడుదల చేశారు. పూజ కొల్లూరు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని అక్టోబర్ 27న విడుదల చేయబోతున్నట్లుగా కూడా ఈ పోస్టర్లో తెలియజేశారు.