తమిళ్ ఎగ్జాటిక్ ఫిల్మ్స్ బ్యానరుపై నిర్మాత షణ్ముగ రామస్వామి తెరకెక్కించిన చిత్రం ‘ఐమా’. సర్వైలెన్స్ థ్రిల్లర్‌గా రూపుదిద్దుకున్న ఈ సినిమాలో యూనిస్, ఎల్విన్ జూలియట్, అఖిల్ ప్రభాకరన్, షాజీ, షీరా, మేఘాబాలు మనోహరన్ తదితరులు నటించారు. ఈ చిత్రం ద్వారా రాహుల్ ఆర్ కృష్ణన్ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. విష్ణు కణ్ణన్ ఛాయాగ్రహణం సమకూర్చగా, కేఆర్ రాహుల్ సంగీతం అందించారు. ఈ చిత్ర ఆడియో, ట్రైలర్ విడుదల కార్యక్రమంలో తాజాగా చెన్నైలో జరిగింది. ఇందులో సీనియర్ నిర్మాత కె.రాజన్, దర్శకులు పేరరసు, కేబుల్ శంకర్ తదితరులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా దర్శకుడు పేరరసు మాట్లాడుతూ... కోలీవుడ్‌కు చెందిన పెద్ద హీరోలు నటించే చిత్రాల్లో తమిళ సినీ నిర్మాణ కార్మికులకు అవకాశం కల్పించాలి. ఇందుకోసం గతంలో ఫెఫ్సీ అధ్యక్షుడు ఆర్‌కే సెల్వమణి తనవంతు ప్రయత్నం చేయగా, దాన్ని మరో కోణంలో తీసుకెళ్లి వివాదం సృష్టించారు. సినిమా అంటేనే ఫిక్షన్. కల్పితాన్ని వెండితెరపై నిజమని నమ్మించడమే సినిమా. ఇందుకోసం నటీనటులు డూప్‌ల సాయంతో నటించాలని అన్నారు. పెద్ద హీరో చిత్రాల నిర్మాణంలో తమిళ సినీ నిర్మాణ కార్మికులకు కూడా ఉపాధి కల్పించాలని ఆయన కోరారు.