జయం రవి, నయనతార హీరోహీరోయిన్లుగా నటించిన క్రైమ్ థ్రిల్లర్ ‘గాడ్’ . ఐ అహ్మద్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రానికి సుధన్ సుందరం, జి.జయరాం, సి.హెచ్.సతీష్ కుమార్ నిర్మాతలు. తమిళంలో ఘన విజయం సాధించిన ఈ చిత్రం అక్టోబర్ 13న తెలుగులో విడుదలయ్యేందకు సిద్ధమైంది. తాజాగా ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా నిర్మాతలు సుధన్ సుందరం, జి.జయరాం, సి.హెచ్.సతీష్ కుమార్ మాట్లాడుతూ .. ‘‘క్రైమ్ థ్రిల్లర్ చిత్రాలను ప్రేక్షకులెప్పుడూ ఆదరిస్తూనే ఉంటారు. ఆ కోవలో తమిళంలో విడుదలై మంచి విజయాన్ని సాధించిన ‘ఇరైవన్’ చిత్రాన్ని తెలుగులో ‘గాడ్’ అనే పేరుతో విడుదల చేస్తున్నాం. సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. రన్ టైమ్‌ను 2 గంటల 16 నిమిషాలుగా ఫిక్స్ చేశాం. హిట్ పెయిర్‌గా పేరు తెచ్చుకున్న జయం రవి, నయనతార ఇందులో మళ్లీ జత కట్టారు. అక్టోబర్ 13న రిలీజ్ అవుతున్న ఈ సినిమా ఆసాంతం సీట్ ఎడ్జ్ థ్రిల్లర్‌గా మెప్పిస్తుంది. సెన్సార్ నుంచి కూడా మంచి ప్రశంసలు అందాయి. థియేటర్లలో ప్రేక్షకులు సైతం ఇలాంటి అనుభూతినే పొందుతారనే భావనతో ఉన్నాం. తప్పకుండా ఈ చిత్రం తెలుగు ప్రేక్షకులకు నచ్చుతుంది’’ అని తెలిపారు.