నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రలనే ఎంచుకొంటూ, అందులోనే తనదైన ప్రత్యేకత చూపిస్తోంది కీర్తి సురేశ్. గ్లామర్ విషయంలో మీకంటూ హద్దులు పెట్టుకొన్నారా? అని అడిగితే.. ‘‘గ్లామర్ అనే పదానికి నాకంటూ ఓ ప్రత్యేకమైన అర్థం, నిర్వచనం ఉన్నాయి. తెరపై అందంగా కనిపించడం మాత్రమే కాదు, ఆ పాత్ర ప్రేక్షకుల మనసుల్ని గెలుచుకొనేలా ఉండాలి. అంతమాత్రాన అంగాంగ ప్రదర్శన చేయడమే గ్లామర్ పాత్రల ఉద్దేశం కాదు. ‘మహానటి’తో నాకంటూ ప్రత్యేకమైన ప్రేమ, అభిమానం సంపాదించుకొన్నాను. నన్నంతా ‘మహానటి’ దృష్టితోనే చూస్తున్నారు. వాళ్లకు నా పట్ల, నేను ఎంచుకొనే పాత్రల పట్ల కొన్ని నమ్మకాలు ఉన్నాయి. వాటిని ఎల్లప్పుడూ నిలబెట్టుకొంటాను. నా దగ్గరకు వచ్చిన దర్శకులు కూడా నటిగా నన్ను నమ్మి వస్తున్నారు. అది నాకు నాపై మరింత నమ్మకాన్ని పెంపొందించే విషయం’’ అని చెప్పుకొచ్చింది.