బాలీవుడ్ బాద్ షా షారూఖ్ ఖాన్ నుంచి తాజాగా వస్తున్న మరో చిత్రం ‘డంకీ’. ఈ ఏడాది ఇప్పటికే షారుఖ్ జనవరిలో 'పఠాన్, సెప్టెంబర్లో 'జవాన్ సినిమాలు ఒకదానిని మించి మరొటి ప్రపంచ వ్యాప్తంగా వెయ్యి కొట్లకు పైగా కలెక్షన్లు కొళ్లగొట్టి జోరుమీదుండగా ఇప్పుడు ముచ్చటగా మూడో సినిమాగా వస్తున్న ఈ సినిమాపై కూడా అంచనాలు రెండింతలు పెరిగాయి. అయితే తాజాగా ఈ రోజు (05.12.2023) మంగళవారం రోజున డంకీ డ్రాప్ 4పేర సినిమా ఫైనల్ ట్రైలర్ను విడుదల చేయగా ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తున్నది. ట్రైలర్లో విదేశాలకు వెళ్లి చదువుకోవాలని కలలు కనే నలుగురు స్నేహితులకు సంబంధించిన కథను సింపుల్గా చూపించే ప్రయత్నం చేశారు. 3 నిమిషాల 2 సెకండ్లు ఉన్న ఈ ట్రైలర్ లో పంజాబ్ లో నివసించే నలుగురు యువతీ యువకులు లండన్లో సెటిల్ అవ్వాలని కలలు కంటూ ఉండడం, ఆ క్రమంలో ఇంగ్లీష్ నేర్చుకునేందుకు ప్రయత్నించి విఫలం అవడం, వీసా రాక పోవడంతో లండన్ వెళ్లేందుకు అక్రమ మార్గాన్ని ఎంచుకుంటారు. ఈ నేపథ్యంలో వాళ్లు ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నారనేది కథ అని ట్రైలర్ చూస్తే అర్థమవుతున్నది. అయితే ఇంగ్లిష్ రాని వారు లండన్ వెళ్లడానికి పనికి రాకుంటే , మరి బ్రిటీష్ వారు హిందీ రాకుండా ఎలా వచ్చారంటూ సాగే డైలాగ్స్ ఆలోచంపజేపే విధంగా ఉన్నాయి. అదే క్రమంలో ఆ మిత్రులు బోర్డర్స్ ఎలా దాటారు, చివరకు అక్కడకు చేరుకున్నారా అనే ఇతివృత్తంతో నిజ ఘటనలను ఆధారంగా చేసుకుని ప్రేమ, స్నేహం కలయికగా ఈ సినిమా రూపొందించారు ట్రైలర్ మనలోని భావోద్వేగాలను తాకుతూ చక్కగా నవ్వుకునేలా, హృదయం ఆకట్టుకునే విధంగా ఉండి ప్రేక్షకులకు వెంటనే కనెక్ట్ అయ్యేలా ఉంది. అయితే ఈ డంకీ సినిమాను డిసెంబర్ 21 న విడుదల చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.