నాని, మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన 'హాయ్ నాన్న' సినిమా డిసెంబర్ 7 న విడుదలవుతున్న సంగతి తెలిసిందే. శౌర్యవ్ ఈ సినిమాకి దర్శకుడు కాగా, మోహన్ చెరుకూరి, మూర్తి కెఎస్, విజయేందర్ రెడ్డి నిర్మాతలు. ఈ సినిమా ప్రచారాలు మొదలు పెట్టారు కానీ ఇందులో నటించిన కథానాయకురాలు మృణాల్ ఠాకూర్ ఎక్కడా కనిపించటం లేదు అని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఎందుకు ఆమె రావటం లేదు అనే విషయానికి చాలా వార్తలు వైరల్ అవుతున్నాయి, కానీ ప్రస్తుతానికి అయితే మాత్రం నానీ ఒక్కడే తన భుజస్కంధాల మీద ఈ సినిమాని ప్రచారాలతో ముందుకు తీసుకువెళుతున్నారు.తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో జరిగిన ఈ సినిమా ప్రచారాలకు మృణాల్ దూరంగా వుంది, ఆమెకి హిందీ సినిమాలు చాలా ఉన్నాయని, అందుకనే ఈ తెలుగు సినిమాని పట్టించుకోలేదని అంటున్నారు. అలాగే ఆమె విజయ్ దేవరకొండతో చేస్తున్న 'ఫామిలీ స్టార్' కి కూడా తన తేదీలను కేటాయించటంతో, ఈ 'హాయ్ నాన్న' సినిమా ప్రచారాలకు రాలేక పోతోంది అని అంటున్నారు. అయితే సాంఘీక మాధ్యమంలో మాత్రం ఆమె రాకపోవటం పట్ల పలు రకాల వార్తలు వస్తున్నాయి.ఈ సినిమా నేపధ్యం నాన్న సెంటిమెంట్ తో ఉంటుందని తెలుస్తోంది. ఇందులో నానికి అతని కుమార్తె కి మధ్య వచ్చే సన్నివేశాల్లో చాలా భావోద్వేగాలు వుంటాయని అంటున్నారు. ఆ చిన్ని పాపని కూడా ఢిల్లీ నుండి వెతికి పట్టుకొచ్చారని కూడా చెప్పారు. ఈ సినిమా పాన్ ఇండియా గా విడుదలవుతూ ఉండటం వలన, ఈ సినిమాలో తెలుగు నటులకన్నా, ఎక్కువ పర భాషా నటులనే చూడొచ్చు అని కూడా తెలిసింది. ఈ సినిమా ఇప్పటికే ఓవర్ బడ్జెట్ అయిందని కూడా వార్త వైరల్ అయింది. దానికితోడు అనుకున్న విధంగా ఈ సినిమా వ్యాపారం కూడా కాకపోవటం, ఈ సినిమా మీద పెద్దగా అంచనాలు కూడా లేకపోవటంతో, నిర్మాతలపై ఒత్తిడి ఉందని తెలుస్తోంది.