తిరుచ్చి కేంద్రంగా కార్యకలాపాలు కొనసాగిస్తూ వచ్చిన ప్రణవ్ జ్యూవెలరీ మోసం కేసులో సినీ నటుడు ప్రకాష్ రాజ్‌కు ఎలాంటి సంబంధం లేదని ఆర్థిక నేర విభాగం పోలీసులు జరిపిన విచారణలో వెల్లడైనట్టు సమాచారం. ఈ విషయాన్ని ఈ కేసులో అరెస్టు చేసిన నిందితుల వద్ద పోలీసులు జరిపిన విచారణలో వెల్లడైందని తెలుస్తోంది. తిరుచ్చితో పాటు రాష్ట్రవ్యాప్తంగా ఏడు శాఖలను కలిగిన ప్రణవ్ జ్యూవెలరీ.. అధిక వడ్డీ ఆశ చూపి పలువురి వద్ద భారీ మొత్తంలో డిపాజిట్లు వసూలు చేసింది. తద్వారా దాదాపు రూ.150 కోట్ల మేరకు మోసానికి పాల్పడినట్టు ఆరోపణలు వచ్చాయి. దీంతో రంగంలోకి దిగిన ఆర్థిక నేరాల విభాగం పోలీసులు ఆ జ్యూవెలర్స్‌కు చెందిన కార్యాలయాలు, యజమానుల నివాసాల్లో తనిఖీలు చేసి, కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. ఇదిలా ఉండగా ఈ కేసులో ప్రణవ్ జ్యూవెలర్స్ అధినేత మదన్ సెల్వరాజ్ ఈనెల 7వ తేదీన మదురై కోర్టులో లొంగిపోయారు. అయితే ఈ మోసం కేసులో నటుడు ప్రకా్‌షరాజ్‌కు కూడా సంబంధం ఉన్నట్టు ఆరోపణలు వచ్చాయి. కానీ, అరెస్టు చేసిన నిందితుల వద్ద జరిపిన విచారణలో ఆయనకు ఎలాంటి సంబంధం లేదని వారు వెల్లడించినట్టు సమాచారం.