నందమూరి కళ్యాణ్ రామ్ సినిమా 'డెవిల్' గత సంవత్సరం ఆఖరి సినిమాగా విడుదలైంది. ఈ సినిమాకి చెప్పుకోదగ్గ రివ్యూస్ మాత్రం రాలేదనే చెప్పాలి. ఈ సినిమా కొంచెం వివాదంలో కూడా వుండింది. ముందుగా నవీన్ మేడారం ఈ సినిమాకి దర్శకుడు, కానీ మధ్యలో ఈ సినిమాకి తనే దర్శకత్వం చేశానని నిర్మాత అభిషేక్ నామ చెప్పారు. అందుకని దర్శకుడిగా అభిషేక్ నామ పేరు వేసుకున్నారు. ఈ సినిమా విడుదలకి ముందు రోజు నవీన్ మేడారం ఈ 'డెవిల్' సినిమా గురించి ఒక పెద్ద లేఖని తన సామజిక మాధ్యమంలో పెట్టారు కూడా. ఇలా ఒక వివాదంలో విడుదలైన ఈ సినిమా కథ 1945 సంవత్సరం ప్రాంతంలో జరిగిన కథ. ఈ సినిమాకి నిర్మాత అభిషేక్ నామ చాలా ఖర్చు పెట్టారని పరిశ్రమలో ఒక టాక్ నడుస్తోంది. సుమారు రూ.40 కోట్లకి పైగానే ఖర్చు పెట్టారని అంటున్నారు, మరి అది ఎంతవరకు నిజమనేది నిర్మాతకు తెలియాలి. కానీ ఇది పీరియడ్ డ్రామా కథ కాబట్టి, ఒక్కో సన్నివేశం చూస్తూ ఉంటే ఈ సినిమాకి బాగానే ఖర్చు పెట్టినట్టుగా కనపడుతోంది. కళ్యాణ్ రామ్ పక్కన సంయుక్త కథానాయికగా నటించగా, ఇందులో మాళవిక నాయర్ ఇంకో ముఖ్య పాత్రలో కనపడింది. కళ్యాణ్ రామ్ ఒక గూఢచారిగా నటించిన ఈ సినిమాలో ఇంకా చాలామంది నటీనటులు కనపడతారు. అయితే వారం రోజులకి ఈ సినిమా షేర్ రూ.10 కోట్లు మాత్రమే కలెక్టు చేసిందని, ఇంకా రూ.10 కోట్లకి పైగా వస్తేనే ఈ సినిమాకి బ్రేక్ ఈవెన్ అవుతుందని ట్రేడ్ అనలిస్ట్స్ అంటున్నారు. అయితే అది చాలా కష్టమని కూడా చెపుతున్నారు.