తేజ సజ్జా హీరోగా ప్రశాంత్ వర్మ రూపొందించిన ‘హను-మాన్’ చిత్రం సంక్రాంతి సందర్భంగా విడుదలై ఘన విజయం సాధించింది. ఈ సందర్భంగా ఇటీవల నిర్మాత కె.నిరంజన్‌రెడ్డి గ్రాటిట్యూట్ మీట్ నిర్వహించారు. ఇందులో దర్శకుడు మాట్లాడుతూ ‘అంతర్జాతీయ స్థాయిలో ఈ సినిమాను తీసుకెళ్లడానికి సహకరించిన నిర్మాత నిరంజన్‌రెడ్డిగారికి కృతజ్ఞతలు. తేజ ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డాడు. ఈ సినిమాతో అతను సూపర్ హీరో అయ్యాడు. అలాగే అమృత చక్కని నటన ప్రదర్శించింది. ఇక వరలక్ష్మిగారు సంక్రాంతికి లక్కీ ఛార్మ్. ఆమెతో వర్క్ చేయడం మంచి అనుభూతి. అలాగే రవితేజగారు మా సినిమాలో భాగం అవడం చాలా ఆనందాన్ని ఇచ్చింది. కోటి పాత్రకు ఆయన ఇచ్చిన వాయి్‌సనే ప్రేక్షకులు ఆస్వాదిస్తున్నారు. రవితేజగారు ఒప్పుకొంటే ఈ యూనివర్స్‌లో ఒక సినిమా చేయాలనుకుంటున్నాను’ అంటూ చిత్రానికి పని చేసిన ప్రతి ఒక్కరికీ పేరు పేరునా అభినందనలు తెలిపారు. ‘జై హనుమాన్’ చిత్రం ‘హను-మాన్’కి వంద రెట్లు ఉండబోతుందని చెప్పారు. ‘ప్రేక్షకులు మా వెనుక నిలబడ్డారు కనుకే మేం ఈ రోజున ఈ వేదికపై ఉన్నాం. మమ్మల్ని బలంగా నమ్మి అండగా నిలిచిన నిర్మాత నిరంజన్‌రెడ్డిగారికి ధన్యవాదాలు. ఇకపై చేసే చిత్రాలు కూడా ఇంతే కష్టపడి ప్రేక్షకులకు నచ్చేలా చేస్తాం.’ అన్నారు హీరో తేజ. ‘హను-మాన్’లో హనుమాన్, మ్యాన్ ఎలా ఉన్నారో ఇక్కడ తేజ, ప్రశాంత్ ఉన్నారని అభినందిచారు వరలక్ష్మి శరత్‌కుమార్. ఇంత గొప్ప విజయం అందించిన ప్రేక్షకులకు ఆమె ధన్యవాదాలు తెలిపారు. నిర్మాత నిరంజన్‌రెడ్డి మాట్లాడుతూ ‘నేను, దర్శకుడు ప్రశాంత్ ఏదైతే నమ్మి మూడేళ్లు హార్డ్ వర్క్ చేశామో ప్రేక్షకుల ఆదరణతో అది సాధించాం. ఈ విజయం వారందరిది. తేజ లేకపోతే ఈ సినిమా లేదు. అలాగే ప్రశాంత్‌కు తన బలం తెలీదు. ‘హను-మాన్’లో చూసింది కేవలం ఒక్క శాతమే.. ఇంకా 99 శాతం బయటకు రావాలి’ అన్నారు.