తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్ కుమార్తె ఐశ్వర్య దర్శకత్వం వహించిన చిత్రం ‘లాల్ సలామ్’. విష్ణు విశాల్ హీరోగా నటించగా.. రజనీ అతిథి పాత్ర పోషించారు. చెన్నైలో జరిగిన ఈ సినిమా ఆడియో విడుదల కార్యక్రమంలో ఐశ్వర్య.. రజనీపై వస్తోన్న ట్రోల్స్ గురించి మాట్లాడారు. ‘‘సోషల్ మీడియాకు నేను చాలా దూరంగా ఉంటా. ఆన్‌లైన్ నెగెటివిటీ గురించి నా టీమ్ తరచూ చెబుతుంటుంది. వాటి వల్ల నేను ఆగ్రహానికి గురైన సందర్భాలున్నాయి. మేమూ మనుషులమే. మాకు మనసు, భావోద్వేగాలు ఉంటాయి. ఈ మధ్య కాలంలో నా తండ్రిని ‘సంఘీ’ అంటూ విమర్శలు చేస్తున్నారు. ఏదైనా రాజకీయ పార్టీకి మద్దతు ఇచ్చేవారిని అలా పిలుస్తారని తెలుసుకున్నా. రజనీకాంత్ సంఘీ కాదు. అలా అయితే.. ఆయన ‘లాల్ సలామ్’లో నటించేవారు కాదు’’ అని పేర్కొన్నారు. ఐశ్వర్య మాటలు విన్న రజనీకాంత్ కన్నీళ్లు పెట్టుకున్నారు. ఇదే వేదికగా రజనీకాంత్ మాట్లాడుతూ.. ‘‘జైలర్’ ఈవెంట్‌లో భాగంగా ‘అర్థమైందా రాజా’ అంటూ నేను చేసిన వ్యాఖ్యలను కొంతమంది తప్పుగా అర్థం చేసుకున్నారు. విజయ్‌పై పరోక్షంగా మాటల దాఢి చేశానన్నారు. అవి నన్నెంతో బాధించాయి. అతడు నా కళ్ల ముందు పెరిగాడు. టాలెంట్, పట్టుదలతో ఈ స్థాయికి వచ్చాడు. నాకు ఎవరితోనూ పోటీ లేదు. నాకు నేనే పోటీ. మా అభిమానులకు చెప్పేది ఒక్కటే.. మమ్మల్ని పోల్చి చూడొద్దు. ‘లాల్ సలామ్’ కథ విన్న వెంటనే యాక్ట్ చేయాలని నిర్ణయించుకున్నా. విష్ణు అద్భుతంగా నటించాడు. ఈ సినిమా చూశాక చిత్ర సంగీత దర్శకుడు రెహమాన్.. ఐశ్వర్యను ఎంతగానో మెచ్చుకున్నారు. సినిమా తప్పకుండా విజయం సాధిస్తుంది’’ అని అన్నారు.