రెండు రోజుల క్రితం ప్రముఖ బాలీవుడ్ నటి, కాంట్రవర్సీ క్వీన్ పూనమ్ పాండే క్యాన్సర్తో చనిపోయినట్లు వచ్చిన వార్తలు దేశాన్ని షాక్కు గురి చేసిన విషయం తెలిసిందే. తెల్లారి నేను చనిపోలేదు బతికే ఉన్నా అంటూ పోస్టు పెట్టడంతో అంతా బిత్తరపోయారు. ఈ విషయమై సోషల్ మీడియా మొత్తం ఆగ్రహం వ్యక్తం చేయగా ఆమెను తీవ్రంగా విమర్శిస్తున్నారు. తాజాగా ఈ ఘటనపై కేసు నమోదైంది. రెండు రోజుల క్రితం శుక్రవారం పూనమ్ పాండే మరణించినట్టుగా ఆమె మేనేజర్ పూనమ్ అధికారిక ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో పోస్టు చేసింది. దీంతో పూనమ్ సర్వైకల్ క్యాన్సర్ తో మృతి చెందినట్లు క్షణాల్లో న్యూస్ ఛానళ్లో, సోషల్ మీడియాల్లో వార్తలు బాగా స్ప్రెడ్ అవడంతో అంతటా చర్చనీయాంశం అయింది. కొంతమంది ఆమె మరణవార్తను తోసిపుచ్చగా, ఎప్పటి మాదిరిగానే అది కేవలం పబ్లిసిటీ స్టంట్ మాత్రమేనంటూ కొట్టిపడేశారు. ఇది జరిగిన 24 గంటల్లోనే పూనమ్ పాండే నేను బతికే ఉన్నానని, గర్భాశయ క్యాన్సర్ మీద అవగాహన కోసమే ఇలా చేశానంటూ ఓ వీడియో విడుదల చేసింది.