తమిళ చిత్రపరిశ్రమకు చెందిన ఇద్దరు అగ్రనటులైన ‘సూపర్‌స్టార్’ రజనీకాంత్, ‘దళపతి’ విజయ్ అభిమానుల మధ్య గత కొన్నేళ్లుగా ‘సూపర్‌స్టార్’ ఎవరన్న దానిపై చర్చ సాగుతూ వచ్చింది. కోలీవుడ్ ‘సూపర్‌స్టార్ తలైవర్’ అని రజనీకాంత్ అభిమానులు అంటే.. కాదు ఇపుడు ‘తమిళ సూపర్‌స్టార్ దళపతి’ అంటూ విజయ్ అభిమానులు వీరావేశంతో నినాదాలు చేస్తూ వచ్చారు. ఈ నేపథ్యంలో ‘జైలర్’ చిత్రం ఆడియో రిలీజ్ వేడుకలో రజనీకాంత్ చెప్పిన ‘కాకి-గద్ద’ కథ ఆ వివాదానికి మరింత ఆజ్యం పోసింది. అయితే, ‘లాల్‌సలాం’ చిత్ర ఆడియో రిలీజ్ వేడుకలో రజనీకాంతే స్వయంగా ఆ వివాదానికి ఫుల్‌స్టాప్ పెట్టే ప్రయత్నం చేశారు. ఇపుడు విజయ్ తన రాజకీయ ప్రయాణంలో తొలి అడుగు వేశారు. దీంతో విజయ్ అభిమానులు ఇకపై రజనీకాంత్, అజిత్ కుమార్ అభిమానులతో గొడవలకు, వాగ్వాదానికి దిగే అవకాశం ఉండదు. ‘గోట్’ , ‘విజయ్ 69’ చిత్రాలను పూర్తి చేసిన తర్వాత పూర్తి స్థాయి రాజకీయాలకు పరిమితంకానున్నట్టు విజయ్ ప్రకటించారు. దీంతో ఈ రెండు చిత్రాల తర్వాత ‘సూపర్‌స్టార్’, ‘అత్యధిక వసూళ్లు’ అనే మాటల చర్చకు శుభంకార్డు పడినట్టే. పైగా విజయ్ ‘తమిళ వెట్రి కళగం’ పేరుతో పార్టీని ప్రకటించగానే ఆయన అభిమానులు సూపర్‌స్టార్ రచ్చను పక్కనబెట్టి.. ‘2026లో ముఖ్యమంత్రి విజయ్’ అంటూ సరికొత్త చర్చకు తెరలేపారు.