వైవిధ్యమైన కాన్సెప్ట్‌తో మూవీస్ చేస్తూ.. సౌత్ ఫిలిం ఇండస్ట్రీలో హీరోగా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును పొందిన హీరో విజయ్ ఆంటోనీ . తన ప్రతి సినిమాను తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు విజయ్ ఆంటోనీ తొలిసారి రొమాంటిక్ ఎంటర్టైనర్ జానర్లో నటిస్తున్న తమిళ ‘రోమియో’ మూవీ తెలుగులో ‘లవ్ గురు’గా విడుదల కాబోతోంది. ఈ సినిమాలో విజయ్ ఆంటోని సరసన మృణాళిని రవి హీరోయిన్గా నటిస్తోంది. ఈ సినిమాను విజయ్ ఆంటోనీ ఫిలిం కార్పొరేషన్ బ్యానర్‌పై మీరా విజయ్ ఆంటోనీ సమర్పణలో విజయ్ ఆంటోనీ నిర్మిస్తున్నారు. వినాయక్ వైద్యనాథన్ దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి ‘చెల్లెమ్మవే..’ అనే సిస్టర్ సెంటిమెంట్ సాంగ్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ పాటకు భాష్యశ్రీ లిరిక్స్ అందించగా.. భరత్ ధనశేఖర్ స్వరాలు సమకూర్చారు. ఆదిత్య ఆర్కే ఆలపించారు. ‘చెల్లెమ్మవే చెయ్యి పట్టుకోవే.. నా చెల్లివే.. నువు నా చెల్లివే.. నేనున్నదే నీ కోసమే.. విధి రాసెనే, ఒక రాతనే... ఆ ఆటలో ఎద కృంగెనే..’ అంటూ హీరో తన సోదరిని తల్చుకుంటూ చిన్ననాటి జ్ఞాపకాలతో ఎమోషనల్‌గా సాగుతుందీ పాట. రొమాంటిక్ ఎంటర్ టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో హార్ట్ టచింగ్ సెంటిమెంట్ కూడా ఉంటుందనే విషయం ఈ పాటతో వెల్లడవుతోంది. పాట విడుదల సందర్భంగా సంగీత దర్శకుడు భరత్ ధనశేఖర్ మాట్లాడుతూ.. ఈ సినిమా ద్వారా సంగీత దర్శకుడిగా పరిచయం కావడం సరికొత్త అనుభూతిని మిగిల్చింది. ఈ చిత్ర విజయానికి నేను సమకూర్చిన సంగీతం కూడా ఒక కారణంగా ఉంటుందని బలంగా నమ్ముతున్నానని పేర్కొన్నారు. ఈ సినిమాను సమ్మర్లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. విజయ్ ఆంటోనీ ఈ సినిమాతో మరింతగా తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నారు. వీటీవీ గణేష్, తలైవాసల్ విజయ్, ఇళవరసు, సుధ, శ్రీజ రవి తదితరులు ఇతర పాత్రలలో నటిస్తున్నారు.