2022లో విడుదలై ఘన విజయం సాధించిన ‘డీజే టిల్లు’ చిత్రానికి సీక్వెల్‌గా రూపొందిన చిత్రం ‘టిల్లు స్క్వేర్’ . స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ, అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి మల్లిక్ రామ్ దర్శకత్వం వహించారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించారు. భారీ అంచనాలతో మార్చి 29వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా.. థియేటర్లలో నవ్వులు పూయిస్తూ కేవలం తొమ్మిది రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.100 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టి రూ.150 కోట్ల దిశగా దూసుకుపోతోంది. ఈ క్రమంలో చిత్ర బృందం సోమవారం సాయంత్రం విజయోత్సవ సభ నిర్వహించింది. ఈ కార్యక్రమానికి యంగ్ టైగర్ ఎన్టీఆర్, త్రివిక్రమ్ శ్రీనివాస్, యంగ్ హీరో విశ్వక్ సేన్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. హైదరాబాద్, శిల్పకళా వేదికలో ఎంతో వైభవంగా జరిగిన ఈ వేడుకలో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ మాట్లాడుతూ.. ఈ సినిమాతో 100 కోట్ల క్లబ్‌లో చేరిన సిద్ధుకి కంగ్రాట్స్. ఈ సినిమా టిల్లు స్క్వేర్ మాత్రమే కాదు రాధిక స్క్వేర్ కూడా. నాలుగు సంవత్సరాల క్రితం ఫస్ట్ మా ఇంట్లో నాకు టిల్లు స్క్రిప్ట్ చెప్పినప్పటి నుంచి నేను సిద్ధుని చూస్తున్నాను. దీని కోసం అతను పడిన కష్టం కానీ, డీజే టిల్లు డైరెక్ట్ చేసిన విమల్ కానీ, టిల్లు స్క్వేర్ డైరెక్ట్ చేసిన మల్లిక్ కానీ.. వాళ్లు మొత్తం టిల్లు తప్ప ఇంకా ఏమీ పని లేనట్టుగా పనిచేశారు. అందుకే ఇంత పెద్ద సక్సెస్ కనిపిస్తోంది. వంశీ, చినబాబు గారు సిద్ధూని, ఆ టీంని నమ్మారు. అందుకే డీజే టిల్లు కంటే టిల్లు స్క్వేర్ పెద్ద హిట్ అయింది. ఈ సంవత్సరం అంటే మంగళవారం నుంచి ‘దేవర’ (Devara) నామ సంవత్సరంగా ప్రకటిస్తున్నాను. ఈ 100 పక్కన ఇంకో సున్నా పెట్టి.. ఆయన దేవర మొదలు పెట్టాలని మీ అందరి తరపున మనందరి తరపున, ఎన్టీఆర్ కంటే కొంచెం పెద్దవాడిని కాబట్టి ఆశీర్వదిస్తున్నాను. ఈ టీం అందరినీ అభినందిస్తూ సెలవు తీసుకుంటున్నాను.. అని అన్నారు.