ఒక ప్రేయసికి ఒక ప్రియుడు ఏమౌతాడో, ఒక ప్రియుడికి ఒక ప్రేయసి ఏమౌతుందో ... ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం సినిమాగానానికి అదవుతారు! సినిమా గానానికి యవ్వనం ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం. ఇవాళ వారి 74వ పుట్టిన రోజు. వివిధ భాషల్లో వేనవేల పాటలు పాడిన ఎస్.పి.బి. 1966లో శ్రీశ్రీశ్రీ మర్యాద రామన్న చిత్రంలో "ఏమి ఈ వింత మోహం" పాటను తమ తొలి పాటగా పాడారు. ఆ పాటలో సహగాయకులైన పి.బి. శ్రీనివాస్ " అప్పుదే ఇతను గొప్ప గాయకుడు అవుతాడనుకున్నాను ఇప్పుడు ఎంతో గొప్పగాయకుడై పోయాడు" అని నాతో చాలాసార్లు అన్నారు. దేశం ఆశ్చర్యపడినంత గొప్ప గాయకులై రాణించారు ఎస్.పి.బి. అవును, మన దేశంలో అందరికన్నా ప్రతిభావంతమైన సినిమా గాయకులు ఎస్.పి.బి. వీరికున్నంత గాన ప్రతిభ ఉన్న సినిమా గాయకులు మనదేశంలో మఱొకరు లేరు. Vocal power అని గాయకులు హరిహరన్ వీరిని అన్నారు. "ప్రయత్నిస్తే నాలా బాలు పాడగలడు కానీ నేను బాలూలా పాడలేను" అని బాలమురళి కృష్ణ ఆన్నారు.
ఎస్.పి.బి.కి తొలిదశ హిట్స్ తమిళ్లో వచ్చాయి. 1969లో వచ్చిన "ఇయర్క్కై ఎన్నుమ్ ఇళయకన్ని" (సినిమా శాంతినిలయం), "ఆయిరం నిలవే వా" (సినిమా అడిమైపెణ్) అన్న రెండు గొప్ప హిట్ పాటలతో మంచి గాయకుడని పేరుతెచ్చుకున్నారు వారు. ఆ పాటల్లో వీరి గానం చాలా బావుంటుంది. ఒక పరిణతి ఉన్న గాయకుడి గానంలా ఉంటుంది. ఎస్.పి.బి - ఘంటసాలను కాకుండా మొహమ్మద్ రఫీ, పి.బి. శ్రీనివాస్ లను ఆదర్శంగా తీసుకున్నారు. ఇది సరైనది. ఇక్కడే వారు తమ గొప్పతనాన్ని చాటుకున్నారు. సుఖదుఃఖాలు సినిమాలో "మేడంటే మేడాకాదు" పాట ఈ విషయాన్ని స్పష్ఘం చేస్తోంది. ఘంటసాలను దాటి ఆలోచించగలగడం వీరి గొప్పతనాన్ని తెలియజేస్తున్నది. అదే వీరి ఇంత పెద్ద గానవిజయానికి కారణం ఈ మేడంటే మేడా కాదు పాటలో వీరి గానంలో "స్వర సమం" అన్న అంశం కనిపిస్తుంది. బహుశా ఆ అంశం సహజంగా అమరి ఉంటుంది. గానంలో భావం మాత్రమే కాదు మనోధర్మం (mood) కూడా ఉండాలి. ముఖ్యంగా సినిమాకు ఇది అవసరం. భావం, మనోధర్మం ఈ రెండిటితోనూ ఎస్.పి.బి.ఎన్నో గొప్ప పాటలు పాడారు. పంతులమ్మ చిత్రంలో వీరు పాడిన "మానసవీణ మధుగీతం" , "ఎడారిలో కోయిల తెల్లారనీ రేయిలా" పాటలను ఇందుకు ఉదాహరణగా తీసుకోవచ్చు. ఏకవీర సినిమాలో "ప్రతి రాత్రి వసంత రాత్రి" , మంచి మిత్రులు సినిమాలో "ఎన్నాళ్లో వేచిన ఉదయం" పాటల్లో ఘంటసాల కన్నా వీరి గానమే మేలైనది. స్వర సమం, spirit, verveల వల్ల వీరి గానం ఆ పాటల్లో గొప్పగా అమరింది.
మొహమ్మద్ రఫీ తరువాత మన దేశంలో గాత్రంలో గొప్ప spirit , verve ఉన్న గాయకులు ఎస్.పి.బి. Animated singing బాలుది. గాయకులు మన్నాదె పాడడం అంటే గొప్పగా పాడడమే. మన్నాదె కన్నా గొప్పగా పాడడమంటే మాటలు కాదు. అలాంటిది "స్నేహమేరా జీవితం" పాటను హిందీలో పాడిన మన్నాదె కన్నా ఎస్.పి.బి.గొప్పగా పాడారు.
వీరి గాత్రం, గానం చాలా emotive.
సాహిత్యాన్ని భావయుక్తంగానూ, మనోధర్మంతోనూ పాడడం వీరికి వెన్నతో పెట్టిన విద్య. "నువ్వేనా సంపంగి పువ్వుల నువ్వేనా" , "కలువకు చంద్రుడు ఎంతో దూరం" లాంటి పాటల్లో మనకు ఈ విషయం తెలుస్తుంది. తమిళ్లో ఎం.ఎస్. విశ్వనాథన్ ఎస్.పి.బి. ప్రతిభను దృష్టిలో పెట్టుకుని ఎన్నో గొప్ప పాటలను చేశారు. ముఖ్యంగా పట్టినప్రవేశం అన్న సినిమాలో "వాన్ నిలా నిలా అల్ల" పాటను చెప్పుకోవచ్చు. దర్శకులు కె.బాలచందర్, ఎం.ఎస్. విశ్వనాథన్ కలయికలో ఎస్.పి.బి. ఎన్నో గొప్ప పాటలు పాడారు. కంబన్ ఏమాందాన్". "ఇలక్కణం మారుదో" పాటలు మహోన్నతమైనవి. తెలుగుకూ తెలిసిన "ఇది కథకాదు" , అందమైన అనుభవం, 47 రోజులు సినిమాల్లోని పాటలు ఎస్.పి.బి. ఉన్నారన్న ధైర్యంతో చేసిన పాటలే.
సంగీత దర్శకులు సత్యం, చక్రవర్తి వంటి వాళ్ల పాటలకు ప్రాణం పోశారు ఎస్.పి.బి. ప్రేమాభిషేకం సినిమా పాటలు వీరు పాడకపోతే ఏమయ్యేవో? మల్లెపూవు సినిమాలో వీరు చాలా గొప్ప గానం చేశారు. "ఎవ్వరో ఎవ్వరో " అన్న పాటను బాలు ఎంతో గొప్పగా పాడారు. కృష్ణ నటించిన దేవదాసు సినిమా పాటల్ని ఎస్.పి.బి. చాలా గొప్పగా పాడారు. అందులో "కల చెదిరింది కథ మారింది" చాలా గొప్ప గానం.
ఇళయారాజా వచ్చాక ఎస్.పి.బి. ఇళయరాజాల కలయికతో తమిళ, తెలుగు, కన్నడ సినిమా పాటళ్లో ఒక్కసారిగా కొత్త అందాలు పూశాయి. వీళ్ల వల్ల దక్షిణాది సినిమా పాటలకు యవ్వనం వచ్చింది. వసంతం వచ్చింది. అభిలాష సినిమా పాటలలో ఈ యవ్వనాన్ని మనం చూడచ్చు. "నెలరాజా పరిగిడకు చెలి వేచే నా కొరకు" , ఇలాగే ఇలాగే సరాగమాడితే" వంటి melodious and mood oriented పాటలు ఇళయరాజా, ఎస్ పి.బి. ఉండబట్టే చెయ్యగలిగారు.
శంకరాభరణం. శంకరాభరణం సినిమాలోని ఎస్.పి.బి. గానం ప్రాంత, భాష, దేశ ఎల్లల్ని దాటి విశ్వ జనరంజకమైంది. ఆ గానం ఒక చరిత్ర అయింది. ఆ సినిమాలో ఎస్.పి.బి. పాడిన "శంకరా నాద శరీరా పరా" ఒక .emotive wonder. ఆ సినిమాలో ఏ పాటకు ఆ పాటే సాటి. శంకరశాస్త్రి పాత్రకు పాడిన ఎస్.పి.బి. "ఆమని కోయిల ఇలా..." అంటూ ఒక యువ పాత్రకు పాడడం వారేమిటో మనకు తెలియజేస్తుంది.
బాలు పాడిన హిందీ సినిమా ఏక్ దూజే కేలియే" సినిమా పాటలు ఉత్తరాదిలో వాడవాడలా మార్మోగి పోయాయి. ఇంకా నౌషాద్ అర్.డి.బర్మన్, బప్పీ లహరి, నదీమ్ శ్రవన్ వంటి సంగీత దర్శకులకు ఎన్నో మంచి పాటలు పాడారు ఎస్.పి.బి. ఒక పాట రికార్డింగ్ సందర్భంలో సంగీత దర్శకులు నౌషాద్, బాలు ప్రతిభకు ఆశ్చర్యపోయారట. సంగీత దర్శకులు ఒ.పి. నయ్యర్ - రఫీ తరువాత దేశంలో ఎస్.పి.బి. మాత్రమే గొప్ప గాయకులు అన్నారు.
నటులకు తగ్గట్టుగా నటుల గొంతుల్ని అనుకరిస్తూ పాడడంలో ఎస్.పి.బి.కి సాటిరాగల వారు ఇంకొకరు లేరు. తమిళ్‌లో టి.ఎం.సౌందరరాజన్ కొందరు నటుల్ని అనుకరిస్తూ పాడారు. కానీ ఎస్.పి.బి. ఈ పనిని తమ ప్రతిభతో అనితరసాధ్యమైన స్థాయిలో చేశారు. ఆడ గొంతుతో కూడా కొన్ని పాటలు పాడారు. మరే గాయకులూ ఎస్.పి.బి. అనుకరించినన్ని గొంతుల్ని అనుకరించలేదు. ఒకే పాటలో రామారావు, నాగేశ్వరరావులను, కృష్ణ , శోభన్ బాబులను అనుకరిస్తూ పాడిన పాటలున్నాయి. రాజాధిరాజు సినిమాలో విజయచందర్‌ను, నూతన్ ప్రసాద్‌లను అనుకరిస్తూ బాలు పాడిన విధానం ఆశ్చర్యాన్నిస్తుంది. రామారావు వంటి వారికి పురుష గాత్రంతో పాడిన బాలు - మాడా, అల్లు రామలింగయ్య వంటివారికి కూడా పాడారు.
సహజంగా tenor-timbre ఎస్.పి.ది. "సువ్వీ సువ్వీ సువ్వాలమ్మ " పాటలో వారు మంద్రస్థాయిలో మొదలు పెట్టిపాడడం గొప్పగా ఉంటుంది.
యుగళ గీతాలలో గాయనీ మణులు వీరికన్నా బాగా పాడడం అన్నది ఎప్పుడూ జరగలేదేమో? ఈనాటికీ ఇంకా ఎస్.పి.బి. పాడుతూనే ఉన్నారు. ఇంత పెద్ద గానజీవితం ఉన్న గాయకులు ఇంకెవరూ లేరు మన దేశంలో. బాలు పాడినన్ని సినిమా పాటలు ప్రపంచంలో ఇంకెవరూ పాడలేదు.
శివస్తుతి బాలు భక్తిగానంలో ఓ కలికితురాయి. తమిళ్లో కణ్ణదాసన్ వ్రాసి ఎం.ఎస్. విశ్వనాథన్ సంగీతం చేసిన కృష్ణుడి పాటలు కలకాలం నిలిచి ఉండే పాటలు. కవి ఆత్రేయ ఒకసారి అన్నారు " బాలు ఫీల్‌తో పాడతాడు ఇతరులు పాడడానికి ఫీల్ అవుతారు" అని. అవును "Balu himself is a singing feel and he himself is a feel of singing. S.P.B. is an enrichment of singing - excellence." ఎస్.పి.బి. ఒక ప్రతిభావంతమైన సంగీత దర్శకులు కూడా. మయూరి చిత్రంలో వీరు గొప్ప పాటలు చేశారు. తమిళ్‌లో సిగరం సినిమాలో గొప్ప పాటలు స్వరపఱిచారు.
బాలు ఒక గొప్ప డబ్బింగ్ కళాకారులు కూడా కదా! బాలు ఒక గొప్ప నటులు. తమిళ సిగరం, తెలుగు పవిత్ర బంధం, మిథునం ఇలా కొన్ని సినిమాల్లో అత్యంత గొప్ప నటనను ప్రదర్శించారు వారు.
ఎస్.పి.బి. పాడి ఉండకపోతే సినిమా గానంలో ఎప్పటికీ ఒక లోటు ఉంటూనే ఉండేదేమో? ఎస్.పి. బి. పాడినందువల్లే సినిమా గానం పరిపుష్టమయిందేమో? సినిమా గానానికి బాలు ఒక అనూహ్యమైన పరిణామం. ఒక చారిత్రిక సంఘటన.
ఎన్నని చెప్పుకోవాలి? ఎంతని చెప్పుకోవాలి? ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం గుఱించి ఎన్నైనా చెప్పుకోవచ్చు, ఎంతైనా చెప్పుకొవచ్చు. ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం సినిమా గానంపరంగా మన దేశానికి ఒక వరం. మన దేశంలో ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం వంటి ప్రతిభ ఉండే గాయకులు మఱోసారి పుట్టరు. సినిమాలకు సంబంధించినంత వరకూ గాన అద్భుతం ఈ శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa