‘నందన్’ వంటి చిత్రాన్ని నిర్మించాలంటే ఎంతో ధైర్యం కావాలని ప్రముఖ దర్శకుడు, నామ్ తమిళర్ కట్చి కన్వీనర్ సీమాన్ అన్నారు. ఎరా శరవణన్ దర్శకత్వం వహించిన నందన్ చిత్రం ఆడియో రిలీజ్ ఇటీవల చెన్నైలో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన సీమాన్ ప్రసంగిస్తూ, ‘నా బిజీ షెడ్యూల్‌తో సంబంధం లేకుండా ఈ సినిమా కథ నన్ను ఈ ఆడియో వేడుకకు వచ్చేలా ప్రేరేపించింది. ఈ సినిమా కోసం ప్రతి ఒక్కరూ ఎంతో అంకితభావంతో పనిచేశారు. ఇది చాలా ముఖ్యమైన చిత్రం. ఇలాంటి చిత్రాన్ని రూపొందించడానికి ఎంతో ధైర్యం కావాలి. ప్రతి ఒక్కరూ తప్పకుండా చూడాలని కోరారు. హీరో శశికుమార్ మాట్లాడుతూ, ‘తొలుత ఈ చిత్రాన్ని నేనే స్వయంగా నిర్మించాలని భావించాను. ఆ తర్వాత అతిథి పాత్రలో నటించాలని అనుకున్నాను. చివరకు ఈ చిత్రంలో పూర్తిస్థాయిలో నటించాలని నిర్ణయించుకుని హీరోగా చేశాను. ఈ స్క్రిప్టు నిజంగా గొప్ప కథ. సినిమా చిత్రీకరణ సమయంలో ఎన్నో ఇబ్బందులు, సమస్యలు ఎదుర్కొన్నాం. ఈ సినిమా ఔట్‌పుట్ కూడా ఆసక్తికరంగా వచ్చింది. ఈ సినిమాలో నటించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు’ అన్నారు. శృతి పెరియస్వామి, మాధేష్, మిథున్, బాలాజీ శక్తివేల్, కొట్ట ఎరుంబు స్టాలిన్, సముద్రఖని, వి.ఙ్ఞానవేల్, జీఎం కుమార్ తదితరులు నటించగా, ట్రైడెంట్ ఆర్ట్స్ పతాకం, ఎరా ఎంటర్‌టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మించాయి.