తొలి చిత్రంతోనే తెలుగువారికి చేరువైంది మృణాల్ ఠాకూర్! 'సీతారామం'తో వెండితెరపై మెరిసి.. 'సీత'గా అభిమానుల గుండెల్లో చెరగని ముద్రవేసింది.అందంతోపాటు అద్భుతమైన నటనతో కట్టిపడేసే ఈ మరాఠీ ముద్దుగుమ్మ.. తక్కువ సమయంలోనే ఎక్కువ క్రేజ్‌ను సంపాదించుకున్నది. తాజాగా అబుదాబీలో జరిగిన ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అకాడమీ అవార్డ్స్ (ఐఫా) ఉత్సవ్‌లో పాల్గొన్నది. ఈ సందర్భంగా బాలీవుడ్ స్టార్ రణ్‌బీర్ కపూర్ గురించి మృణాల్ చేసిన వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి.ఇంతకూ మృణాల్ ఏమన్నదంటే.. 'అందరూ యానిమల్ సినిమాలో రణ్‌బీర్ పాత్ర గురించే మాట్లాడుతున్నారు. ఆ పాత్ర ఎంతో క్రూరంగా ఉన్నదని విమర్శిస్తున్నారు. అయితే, 2012లో ఇదే రణ్‌బీర్ 'బర్ఫీ'లో చెవిటి-మూగ వ్యక్తిగా నటించిన విషయాన్ని ఎవరూ మర్చిపోవద్దు. అప్పుడు అమాయకుడిగా.. ఇప్పుడు యానిమల్గా రెండు విభిన్న పాత్రలను అద్భుతంగా పండించాడు రణ్‌బీర్..' అంటూ కపూర్ల వారసుణ్ని ఆకాశానికి ఎత్తేసింది. బర్ఫీ, యానిమల్ చిత్రాల్లో అద్భుతమైన నటనా కౌశలాన్ని పండించిన రణ్‌బీర్.. రెండు చిత్రాలకూ ఫిల్మ్‌ఫేర్ అవార్డులు అందుకోవడం విశేషం!