మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై ఆరోపణలు గుప్పిస్తూ.. అక్కినేని కుటుంబాన్ని ప్రస్తావించిన మంత్రి కొండా సురేఖ వివాదాస్పద వ్యాఖ్యలపై హీరో అక్కినేని నాగార్జున ట్విట్టర్ ఎక్స్ వేదికగా స్పందించారు. కొండా సురేఖ వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా ఖండిస్తున్నానని ప్రకటించారు. అక్కినేని నాగార్జున తన ట్వీట్లో ఏం చెప్పారంటే.. ‘‘గౌరవనీయ మంత్రివర్యులు శ్రీమతి కొండా సురేఖ గారి వ్యాఖ్యలని తీవ్రంగా ఖండిస్తున్నాను.
రాజకీయాలకు దూరంగా ఉండే సినీ ప్రముఖుల జీవితాలని, మీ ప్రత్యర్ధులని విమర్శించేందుకు వాడుకోకండి. దయచేసి సాటి మనుషుల వ్యక్తిగత విషయాలని గౌరవించండి. బాధ్యత గలిగిన పదవిలో ఉన్న మహిళగా మీరు చేసిన వ్యాఖ్యలు, మా కుటుంబం పట్ల మీరు చేసిన ఆరోపణలు పూర్తిగా అసంబద్ధం, అబద్ధం. తక్షణమే మీ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవలిసిందిగా కోరుతున్నాను.’’ అని నాగార్జున తన ట్వీట్లో పేర్కొన్నారు.