తెలంగాణ రాష్ట్ర మంత్రి కొండా సురేఖ తాజాగా చేసిన సంచలన వ్యాఖ్యలపై నటుడు ప్రకాష్ రాజ్ రెస్పాండ్ అయ్యారు. తెలంగాణ మాజీ ఐటీ శాఖ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ని టార్గెట్ చేస్తూ హీరోయిన్స్ సమంత, రకుల్ ప్రీత్ సింగ్ పేర్లని ప్రస్తావించడంపై ఆయన భగ్గుమన్నారు. తిరుపతి లడ్డూ వివాదంలో వరుస ట్వీట్లతో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై విరుచుకుపడిన ఆయన మరోసారి కొత్త వివాదంలో వేలుపెట్టినట్లుగా తాజాగా ఆయన ట్వీట్‌తో తెలుస్తోంది. ప్రకాష్ రాజ్ సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్‌గా ఉంటూ సమకాలీన రాజకీయాలపై హాట్ కామెంట్రీ చేస్తుంటారు.
తాజాగా కేటీఆర్‌పై కొండా సురేఖ చేసిన వ్యాఖ్యల విధానం ఆయనకే చిర్రెత్తేలా చేసింది. మంత్రి సరైన సాక్ష్యాధారాలు లేకుండా హీరోయిన్ల పేర్లు ప్రస్తావించడంపై ఆయన ‘X’ ఖాతా ద్వారా అసహనం వ్యక్తం చేశారు. ‘ఏంటీ సిగ్గులేని రాజకీయాలు… సినిమాల్లో నటించే ఆడవాళ్ళంటే చిన్న చూప?’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. వాస్తవానికి ఇద్దరు ఆడబిడ్డల వ్యవహారాల్ని సరైన ఆధారాలు లేకుండా నీచ రాజకీయాల కోసం మంత్రి హోదాలో ఒక స్త్రీ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఏంటని కొందరు ప్రకాష్ రాజ్‌కి మద్దతు తెలుపుతున్నారు. మరికొందరు హైదరాబాద్‌లో సంచలనం సృష్టిస్తున్న ‘హైడ్రా’ ని పక్క దారి పట్టించేందుకు కాంగ్రెస్ ఈ వ్యూహాన్ని పన్నినట్లు కామెంట్ చేస్తున్నారు.