'జాతిపిత' మహాత్మా గాంధీ 155వ జయంతి నేడు. ఆయన అడుగుజాడల్లో నడవటం ఆశయాలు సాధించటం కోసం కృషి చేయడం సగటు భారతీయుడి బాధ్యత. అహింస మార్గం ద్వారా కూడా విజయాలు సాదించ వచ్చు అని నిరూపించి భారతీయ ఖ్యాతిని ప్రపంచ నలుమూలాలకి విస్తరంచిన గాంధీ జయంతిని మనం కచ్చితంగా సెలబ్రేట్ చేసుకోవాలి. ప్రపంచం మొత్తం కొనియాడిన గాంధీ భావాలను కేవలం భారతీయ చిత్ర సీమ నుండే కాకుండా హాలీవుడ్‌లోను చిత్రాల రూపంలో విడుదల చేశారు.గాంధీ అంటే సినీ ప్రేమికులకు మొదటగా గుర్తొచ్చే సినిమా 'లగేరహో మున్నాభాయ్' బాలీవుడ్‌లో రాజ్‌కుమార్ హిరానీ దర్శకత్వంలో సంజయ్ దత్, అర్షద్ వార్సీ నటించిన ఈ సినిమా ఓ సంచలనం. ఒక రౌడీ గాంధీ భావజాలానికి ప్రభావితమై గూండాగిరి వదిలేసి గాంధీగిరి ప్రారంభిస్తాడు. అప్పుడు అతనిలో సమాజంలో వచ్చిన మార్పు ఏమిటనేది కమర్షియల్ యాంగిల్‌లో చక్కగా చూపెట్టారు.
ఇదే సినిమాని తెలుగులో ప్రభుదేవా శంకర్ దాదా జిందాబాద్ పేరుతో రీమేక్ చేశాడు. చిరంజీవి, శ్రీకాంత్ ప్రధాన పాత్రల్లో అదరగొట్టిన కమర్షియల్‌గా ఫెయిల్ అయ్యింది. కానీ.. టీవీలలో జనాలు ఇప్పటికి ఎగబడి చూస్తారు. కమల్ హాసన్ నటించడంతో పాటు రచించి, దర్శకత్వం వహించిన చిత్రం హే రామ్. ఈ మూవీ 2000 సంవత్సరంలో రిలీజై అనేక కాంట్రవర్సీలకు కేరాఫ్‌గా నిలిచింది. విమర్శకుల ప్రశంసలు అందుకున్న ఈ సినిమా కమర్షియల్‌గా ఫెయిల్ అయ్యింది. ఇప్పటికి ఎంతో మంది సినీ విశ్లేషకుల సజెస్ట్ చేసే బెస్ట్ సినిమాల లిస్ట్‌లో ఈ మూవీ ఎప్పుడు స్థానం సొంతం చేసుకుంటుంది. హేమ మాలిని , రాణి ముఖర్జీ , నసీరుద్దీన్ షా లాంటి హేమాహేమీలతో పాటు షారుక్ ఖాన్ ఈ మూవీలో అతిథి పాత్రలో కనిపించారు. తెలుగులోనూ డైరెక్టర్ కృష్ణవంశీ తెరకెక్కించిన 'మహాత్మ' సినిమా తన మార్క్ మూవీగా నిలిచింది. శ్రీకాంత్ 100వ చిత్రంగా పొలిటికల్ డ్రామాగా రూపొందించిన ఈ చిత్రం కమర్షియల్గా పర్వాలేదనిపించింది. ఇక సినిమాలోని ఇతర పాటలతో పాటు సిరివెన్నెల సీతారామశాస్త్రి రాసిన 'ఇందిరమ్మ ఇంటి పేరు కాదుర గాంధీ' సాంగ్ ఓ సంచలనం.