పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతల మధ్య ప్రపంచ ఇంధన మార్కెట్‌లో సంచలన పరిణామం చోటు చేసుకుంది. ప్రధాన చమురు ఉత్పత్తి కూటములైన ఒపెక్, ఒపెక్+ నుంచి వైదొలగుతున్నట్లు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) కీలక ప్రకటన చేసింది.ఈ నిర్ణయం 2026 మే 1 నుంచి అమల్లోకి రానుందని యూఏఈ ప్రభుత్వ వార్తా సంస్థ వామ్ మంగళవారం (ఏప్రిల్ 27) వెల్లడించింది. దీర్ఘకాలిక ఆర్థిక మరియు ఇంధన వ్యూహంలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు యూఏఈ స్పష్టం చేసింది. చమురు ఉత్పత్తి, రవాణా రంగాలను మరింత స్వతంత్రంగా నిర్వహించుకునే అవకాశం ఈ నిర్ణయంతో లభిస్తుందని పేర్కొంది.అలాగే చమురు, గ్యాస్‌తో పాటు తక్కువ కార్బన్ ఇంధన రంగాల్లో విదేశీ పెట్టుబడులను వేగవంతం చేయడానికి ఈ చర్య దోహదపడుతుందని యూఏఈ తెలిపింది. అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలతో ప్రపంచవ్యాప్తంగా ఇంధన సంక్షోభం నెలకొన్న సమయంలో ఈ నిర్ణయం గ్లోబల్ ఆయిల్ మార్కెట్‌ను కుదిపేస్తోంది. విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం, యూఏఈ నిష్క్రమణ ఒపెక్, ఒపెక్+ కూటముల ఐక్యతపై ప్రభావం చూపే అవకాశం ఉంది.ఒపెక్ (Organization of the Petroleum Exporting Countries) 1960లో ప్రపంచ చమురు మార్కెట్‌ను సమన్వయంగా నియంత్రించాలనే లక్ష్యంతో ఏర్పడింది. ఇరాన్, ఇరాక్, కువైట్, సౌదీ అరేబియా, వెనిజులా వంటి దేశాలు ప్రారంభ సభ్యులుగా ఉన్నాయి. ప్రస్తుతం ఈ కూటమిలో 12 దేశాలు సభ్యులుగా కొనసాగుతున్నాయి.ఒపెక్‌కు కొనసాగింపుగా 2016లో ఒపెక్+ కూటమి ఏర్పడింది. ఇందులో ఒపెక్ సభ్య దేశాలతో పాటు రష్యా సహా 10 ఇతర చమురు ఉత్పత్తి దేశాలు కూడా భాగస్వాములుగా ఉన్నాయి. ప్రపంచ చమురు సరఫరా, ధరల నియంత్రణే ఈ కూటమి ప్రధాన లక్ష్యం.యూఏఈ నిష్క్రమణతో ఒపెక్ కూటమికి పెద్ద ఎదురుదెబ్బ తగిలినట్లయిందని విశ్లేషకులు భావిస్తున్నారు. ముఖ్యంగా పశ్చిమాసియాలో కొనసాగుతున్న సంక్షోభం కారణంగా చమురు సరఫరా ఇప్పటికే ఒత్తిడిలో ఉంది. ఈ పరిస్థితుల్లో కీలక సభ్యదేశం బయటకు వెళ్లడం కూటమి బలాన్ని తగ్గించవచ్చని అంచనా.యూఏఈ ఇకపై తన చమురు ఉత్పత్తి, ధరలు, ఎగుమతులను స్వతంత్రంగా నిర్ణయించుకోనుంది. అంటే తమ ఇంధనాన్ని కావలసిన ధరకు, కావలసిన మార్కెట్లకు విక్రయించే అవకాశం లభిస్తుంది.ప్రపంచ ఇంధన మార్కెట్ అస్థిరంగా ఉన్న ఈ సమయంలో ఈ నిర్ణయం ఒపెక్+ భవిష్యత్ సమైక్యతపై ప్రశ్నలు రేకెత్తిస్తోంది. చమురు ధరల స్థిరత్వాన్ని కాపాడటంలో కూటమి సామర్థ్యం కూడా ప్రభావితమయ్యే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa