70వ జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రదానోత్సవ వేడుక దిల్లీ వేదికగా ఘనంగా జరిగింది. 2022 సంవత్సరానికి గానూ వివిధ భాషల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన నటీనటులు, సాంకేతిక నిపుణులు రాష్ట్రపతి చేతులమీదుగా అవార్డులు అందుకున్నారు. వీరిలో బాలీవుడ్ నటి యామీ గౌతమ్ తండ్రి ముఖేష్ గౌతమ్ కూడా ఉన్నారు. ఆయన తెరకెక్కించిన ‘బాఘీ దీదీ’ ఉత్తమ పంజాబీ చిత్రంగా ఎంపికైంది. ఈ చిత్రానికి గాను ముఖేష్ నేషనల్ అవార్డును అందుకున్నారు. ఈ ఫొటోను షేర్ చేసిన యామీ గౌతమ్ ఎమోషనల్ పోస్ట్ పెట్టారు.‘‘దర్శకుడిగా మా నాన్న మొదటి జాతీయఅవార్డును అందుకుంటున్నారు. ఇవి చాలా భావోద్వేగ క్షణాలు. నా ఆనందాన్ని మాటల్లో వర్ణించలేను. ఇంత గొప్ప వ్యక్తికి కూతురిగా పుట్టినందుకు గర్వంగా ఉంది. ఎన్నో కష్టాలు ఎదుర్కొని ఈ స్థాయికి వచ్చారు. సినిమాలపై ఆయనకు ఉన్న అభిరుచి, అంకితభావం ఆయన్ని ఈ స్థాయిలో నిలబెట్టాయి. నాతోపాటు మా కుటుంబమంతా గర్వపడుతోంది’’ అని రాశారు. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ అవుతుండగా.. నెటిజన్లు ముఖేష్‌కు శుభాకాంక్షలు చెబుతున్నారు.