నా కెరీర్‌లో మొదటిసారి తల్లి పాత్ర పోషించాను. ఈ క్యారెక్టర్ కొంచెం ఛాలెంజింగ్‌గా అనిపించింది. చిన్నతనంలో నాతో అమ్మ ఎలా ఉండేదో అనే విషయాలను తెలుసుకొని నటించా.నటిగా పాత్రల విషయంలో వైవిధ్యం చూపించాలనుకుంటున్నా. అందుకు తగినట్లుగా సినిమాలను ఎంచుకుంటున్నా' అని చెప్పింది మీనాక్షి చౌదరి. ఆమె కథానాయికగా నటించిన తాజా చిత్రం 'లక్కీ భాస్కర్’ ఈ నెల 31న విడుదలకు సిద్ధమవుతున్నది. వెంకీ అట్లూరి దర్శకత్వంలో సూర్యదేవర నాగవంశీ నిర్మించారు. ఈ సందర్భంగా సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మీనాక్షి చౌదరి మాట్లాడుతూ 'ఈ సినిమాలో నేను సుమతి అనే మధ్యతరగతి ఇల్లాలి పాత్రలో కనిపిస్తా. ప్రేమను పంచే భర్త, బ్రతకడానికి అవసరమైనంత డబ్బు ఉంటే చాలనుకునే స్వభావం ఆమెది.
అయితే భర్త భాస్కర్‌కు డబ్బు పట్ల ఉండే విపరీతమైన వ్యామోహం వల్ల దంపతుల జీవితం ఎలాంటి మలుపులు తిరిగిందన్నది ఆసక్తికరంగా ఉంటుంది' అని చెప్పింది. ఈ సినిమాతో నటిగా తనకు మంచి గుర్తింపు లభిస్తుందనే నమ్మకం ఉందని, భవిష్యత్తులో మరిన్ని ఛాలెంజింగ్ రోల్స్ చేసే అవకాశం లభిస్తుందని మీనాక్షి చౌదరి విశ్వాసం వ్యక్తం చేసింది. బ్యాంకింగ్ నేపథ్యంలో ఇప్పటికే కొన్ని సిరీస్‌లు వచ్చినా.. ఫ్యామిలీ ఎమోషన్స్‌తో దర్శకుడు ఈ కథను అద్భుతంగా రాశాడని, ఇది సామాన్యుడి కథ కాబట్టి ప్రతి ఒక్కరికి కనెక్ట్ అవుతుందని తెలిపింది. తన తదుపరి సినిమాల గురించి చెబుతూ 'మట్కా, మెకానిక్ రాకీ విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. వెంకటేష్-అనిల్ రావిపూడి సినిమాలో నటిస్తున్నా. మరికొన్ని సినిమాలు చర్చల దశలో ఉన్నాయి' అని చెప్పింది.