కిరణ్ అబ్బవరం హీరోగా నటించిన చిత్రం 'క' . తాజాగా ఈ సినిమా సక్సెస్‌మీట్ హైదరాబాద్‌లో జరిగింది.ఇందులో పాల్గొన్న నిర్మాత దిల్‌రాజు కీలక వ్యాఖ్యలు చేశారు. చిత్రపరిశ్రమలో ఎవరూ ఎవరికీ సాయం చేయరన్నారు. మనల్ని మనమే నిరూపించుకోవాలని చెప్పారు.
''ఇటీవల 'క' ప్రెస్‌మీట్‌లో కిరణ్ అబ్బవరం చేసిన వ్యాఖ్యలు విన్నా. అదే విధంగా నిన్న ఒక హీరో కూడా సెలబ్రిటీలు ఎవరూ తమ చిత్రాన్ని సపోర్ట్ చేయడానికి రావడం లేదన్నాడు. చిత్రపరిశ్రమలో మిమ్మల్ని మీరే నిరూపించుకోవాలి. ఎవరో ఏదో అన్నారని భయపడకూడదు. టాలెంట్ ఉంటే తప్పకుండా సక్సెస్ అవుతారు. ఇక్కడ కేవలం టాలెంట్‌కే పెద్ద పీట వేస్తారు. కష్టపడ్డారు కాబట్టే 'క' ఇంతటి విజయం సాధించింది. ట్రోల్స్ గురించి వస్తే.. దాదాపు 50 ఏళ్ల క్రితం పల్లెటూర్లలో ఉండేవాళ్లు ఖాళీగా కూర్చొని ఇతరుల గురించి మాట్లాడుకునేవారు. వాళ్లు అదృష్టవంతులు. ఆ రోజుల్లో సోషల్‌మీడియా లేదు కాబట్టి ఆ విషయాలు ఊరిలోనే ఆగిపోయాయి. ఇప్పుడు సోషల్‌మీడియా ఉండటం వల్ల ప్రపంచానికి తెలుస్తోంది. దానివల్ల నీకు ఏమీ జరగదు. పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు''
''కిరణ్.. నీ సక్సెస్ మాట్లాడాలి. ఎప్పుడూ ఎమోషనల్ కావద్దు. ఎందుకంటే నీ వద్ద టాలెంట్ ఉంది. ఎక్కడో చిన్న గ్రామంలో పుట్టి.. నిన్ను నువ్వు నమ్ముకుని పరిశ్రమలోకి అడుగుపెట్టి తొలి ప్రయత్నంలోనే విజయం సాధించావు. నేను కూడా పల్లెటూరు నుంచి వచ్చి ఈ స్థాయిలో నిలబడ్డా. ఇక్కడ హార్డ్‌వర్కే మనల్ని నిలబెడుతుంది. ఎవరూ వెనక్కి లాగారు. సపోర్ట్ చేయరు. సెలబ్రిటీలు రాలేదంటున్నారు.. ఎవరి బిజీ వాళ్లది. వాళ్లు వచ్చారా? లేదా? అనేది ముఖ్యం కాదు. నీ సినిమాని ప్రేక్షకుల్లోకి ఎలా తీసుకువెళ్లావనేది ముఖ్యం. కాబట్టి ఇండస్ట్రీలోకి వచ్చే ప్రతి ఒక్కరూ ఈ విషయాన్ని గ్రహించి కష్టపడి వర్క్‌చేయాలి'' అని దిల్ రాజు తెలిపారు.