రాజుల కాలంలో అంతఃపుర మహిళలకు సేవ చేసేందుకు వచ్చిన వారే తెలుగు వారంటూ నటి, బీజేపీ నాయకురాలు కస్తూరి వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఆమె వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణించిన తెలుగు సంఘాలు, ప్రముఖులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.డీఎంకే పార్టీ నేతలు తనను టార్గెట్ చేస్తున్నారని కస్తూరి మండిపడింది. కస్తూరిపై ఇప్పటికే చెన్నై, మధురై ప్రాంతాల్లో కేసులు నమోదయ్యాయి. దీంతో ఆమెకు సమన్లు జారీ చేసేందుకు ఆమె ఇంటికి వెళ్లిన పోలీసులకు అక్కడ తాళం వేసి కనిపించింది. ఆమెకు ఫోన్ చేసినా కూడా స్విఛ్చాఫ్ రావడంతో గాలింపు చర్యలు చేపట్టారు. కేసుల భయంతోనే కస్తూరి పరారీలో ఉన్నారని పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే ఈ కేసుల విషయంలో ఆమె ఓ లాయర్ ను సంప్రదించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.హిందూ పీపుల్స్ పార్టీ ఆఫ్ తమిళనాడు తరుపున బ్రాహ్మణులకు రక్షణ కల్పించేందుకు ప్రత్యేక చట్టం తేవాలని డిమాండ్ చేస్తూ నటి కస్తూరి తెలుగు ప్రజలపై అనుచిత వ్యాఖ్యలు చేసింది. సుమారు 300 ఏళ్ల క్రితం రాజుల కాలంలో అంతఃపురంలో మహిళలకు సేవ చేయడానికి తమిళనాడుకు తెలుగు వారు వచ్చారని ఆమె వ్యాఖ్యలు చేసింది. అలా వచ్చిన వారంతా ఇప్పుడు తమది తమిళ జాతి అంటూ పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారని.. ఎప్పుడో ఇక్కడకు వచ్చిన బ్రాహ్మణులను తమిళులు కాదని చెప్పడానికి తెలుగు వారు ఎవరు ? అంటూ ప్రశ్నించింది. దీంతో ఆమె వ్యాఖ్యలపై సర్వత్రా విమర్శలు వచ్చాయి.