డైరెక్ట్ గా ఓటీటీలో స్ట్రీమింగ్ కు వచ్చిన తాజా తెలుగు చిత్రం ‘వైఫ్ ఆఫ్’. ఈటీవీ విన్ ఓటీటీలో ఎలాంటి అంచనాలు లేకుండా రిలీజ్ అయిన ఈ మూవీలో దివ్యశ్రీ, అభినవ్ మణికంఠ ప్రధాన పాత్రల్లో నటించారు. మరి ఈ మూవీ ఓటీటీ మూవీ లవర్స్ ను ఎంతవరకు ఆకట్టుకుందో రివ్యూలో చూద్దాం.
కథ :కొత్త హీరోయిన్ అవని (దివ్య శ్రీ), షార్ట్ ఫిల్మ్ డైరెక్టర్ అభి (అభినవ్ మణికంఠ)తో ప్రేమలో పడుతుంది. అయితే పరిస్థితుల కారణంగా ఆమె తన బావ (నిఖిల్ గాజుల)ని పెళ్లి చేసుకోవలసి వస్తుంది. కానీ దురదృష్టవశాత్తు ఆమె భర్త అవనిని చిత్రహింసలకు గురి చేస్తాడు. ఆమె కూడా సైలెంట్ గా భర్త పెట్టే హింసను భరిస్తూ ఉంటుంది. ఒకరోజు సడన్ గా ఆమె భర్త ఆత్మహత్య చేసుకుని శవమై కన్పిస్తాడు. దీంతో ఏం చేయాలో తోచక తన ఎక్స్ అభిని అవని సహాయం కోరుతుంది. అసలు ఇంట్లో ఏం జరిగింది? అవని గతంలో ఏం పని చేసేది? భర్త మరణానికి కారణం ఏంటి ? అసలు భర్త ఆమెను ఎందుకు చిత్రహింసలు పెట్టేవాడు? చివరికి ఏం జరిగింది ? అన్న ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవడానికి సినిమా చూడాల్సిందే.
విశ్లేషణ :దర్శకుడు సింపుల్ స్టోరీ లైన్ ను తీసుకుని, మంచి స్క్రీన్‌ప్లేతో ఎలివేట్ చేయడానికి ప్రయత్నించాడు. గ్రిప్పింగ్ కథనంతో నడిచే థ్రిల్లర్ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడంలో మాత్రం తడబడ్డాడు. ఇలాంటి స్టోరీ లైన్ తో ఇప్పటికే చాలా సినిమాలు వచ్చాయి. కాబట్టి మూవీని మరింత అట్రాక్టివ్ గా తీర్చిదిద్దే ఛాన్స్ ఉన్నప్పటికీ దర్శకుడు ఉపయోగించుకోలేదు. సస్పెన్స్‌ని కంటిన్యూ చేయడానికి కథను మూడు భాగాలుగా కట్ చేసిన ప్రయత్నం ఇంట్రెస్టింగ్ గా ఉంది. కానీ కథనం, ఎగ్జిక్యూషన్ అంత ఆసక్తికరంగా లేకపోవడం వల్ల ఈ మూవీ ప్రేక్షకులను కట్టిపడేయడంలో ఫెయిల్ అయ్యింది. దర్శకుడు కొంత వరకు సస్పెన్స్‌ని క్రియేట్ చేయడంలో సక్సెస్ అయ్యాడు. కానీ దాన్ని సినిమా చివరి వరకూ నిలబెట్టలేకపోయాడు. స్క్రీన్‌ప్లే నీట్‌గా ఉంది. కానీ థ్రిల్లర్‌కి అవసరమైన ఇంటెన్సిటీ లేదు. నిర్మాణ విలువలు, సౌండ్ డిజైన్ ఎంత దారుణంగా ఉన్నాయంటే యూట్యూబ్ షార్ట్ ఫిల్మ్ ను చూస్తున్న ఫీలింగ్ కలుగుతుంది. క్లైమాక్స్ కూడా నిరాశ పరుస్తుంది. సినిమా కొన్నిసార్లు అనవసరంగా సాగదీసినట్లుగా అన్పిస్తుంది. ఎడిటర్ కు మరింత పని పెట్టి ఉండవచ్చు. సినిమాటోగ్రఫీ డీసెంట్‌గా ఉన్నప్పటికీ, సినిమాని పెద్దగా ఎలివేట్ చేయలేదు. నటి దివ్య శ్రీ యాక్టింగ్ బాగుంది. అభినవ్ మణికంఠ తన డ్యూయల్ షేడ్ క్యారెక్టర్‌ని చక్కగా హ్యాండిల్ చేశాడు. నిఖిల్ గాజుల, సాయి శ్వేత తమ పాత్రల పరిధిమేరకు ఓకే అన్పించారు.
ప్లస్ పాయింట్స్ :
నటీనటుల యాక్టింగ్
అక్కడక్కడా వచ్చే ట్విస్ట్ లు
మైనస్ పాయింట్స్ :
కథనం
సాగదీసిన సన్నివేశాలు