ఢిల్లీకి ఏపీ సీఎం.. కేంద్రం ముందు ఉంచే డిమాండ్లు ఇవే
 

by Suryaa Desk | Mon, Jul 01, 2024, 07:55 PM

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు త్వరలోనే ఢిల్లీ వెళ్లనున్నారు. ఏపీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత చంద్రబాబు ఢిల్లీ వెళ్లడం ఇదే తొలిసారి. జులై నాలుగో తేదీన చంద్రబాబు ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు. ఢిల్లీ పర్యటనలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సహా పలువురు కేంద్ర మంత్రులను చంద్రబాబు కలవనున్నట్లు సమాచారం. జులై నెలాఖరులో కేంద్రం బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు ఢిల్లీ వెళ్తున్నట్లు సమాచారం. 2024 సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో కేంద్రం ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టింది. ఇప్పుడు పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. ఈ నేపథ్యంలో ఏపీకి నిధుల కేటాయింపుపై ఆర్థిక మంత్రితో చంద్రబాబు చర్చించే అవకాశం ఉంది.


2024 ఏపీ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా టీడీపీ కూటమి పలు హామీలతో ఎన్నికల మేనిఫెస్టో ప్రకటించింది. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో వాటిని అమలు చేయాల్సిన అవసరం ఉంది. వీటికి తోడు పోలవరం, అమరావతి రాజధాని నిర్మాణానికి కూడా భారీగా నిధులు కావాల్సి ఉంది. అయితే ఏపీ ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉండటంతో.. కేంద్రం ద్వారా బడ్జెట్‌లో ఏపీకి భారీగా నిధులు సాధించుకునేందుకు చంద్రబాబు ఢిల్లీ వెళ్తున్నట్లు తెలిసింది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో జరిగే భేటీలో బడ్జెట్‌లో ఏపీకి కేటాయింపులు, రాష్ట్రానికి రావాల్సిన నిధులు, కొత్తగా తెచ్చుకోవాల్సిన పథకాలపై చర్చించే అవకాశం ఉంది.


మరోవైపు ఏపీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత చంద్రబాబు నాయుడు తొలిసారిగా హస్తినకు వెళ్తున్నారు. ఈ క్రమంలోనే ఆయన ప్రధానమంత్రి నరేంద్ర మోదీతోనూ భేటీ కానున్నట్లు సమాచారం. పోలవరం, అమరావతి రాజధాని నిర్మాణం వంటి అంశాలను ఆయనతో చర్చించే అవకాశాలు ఉన్నాయి. పోలవరం నిర్మాణంపై ఇప్పటికే శ్వేతపత్రం విడుదల చేసిన చంద్రబాబు.. దీనిపై కేంద్ర జలశక్తి మంత్రిత్వశాఖతోనూ చర్చించే అవకాశాలు ఉన్నాయి. పోలవరం ప్రాజెక్టును అంతర్జాతీయ నిపుణుల బృందం సందర్శించింది. వీరు చేసిన సలహాలు, సూచనలను చంద్రబాబు.. కేంద్ర జలశక్తి మంత్రిత్వశాఖ వద్ద ప్రస్తావించనున్నారు.


మొత్తంగా ఏపీ సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారిగా చంద్రబాబు ఢిల్లీ వెళ్తుండటం.. అందులోనూ బడ్జెట్ ప్రవేశపెట్టడానికి ముందు వెళ్తున్న నేపథ్యంలో ఈ విషయం రాజకీయంగా హాట్ టాపిక్‌గా మారింది. ప్రస్తుత ఎన్టీఏ ప్రభుత్వంలో చంద్రబాబు నేతృత్వంలోని టీడీపీ కీలకంగా మారిన పరిస్థితుల్లో.. చంద్రబాబు ఏ మేరకు నిధులు సాధిస్తారనేదీ ఆసక్తికరంగా మారింది.

Latest News
SC to hear PIL on controlling air pollution tomorrow Sun, Oct 13, 2024, 01:07 PM
Police officer stabbed in Istanbul Sun, Oct 13, 2024, 12:37 PM
Jordan evacuates 35 nationals from Lebanon Sun, Oct 13, 2024, 12:32 PM
32 Indian startups raise $135 million in funding this week Sun, Oct 13, 2024, 12:20 PM
AI PCs set to evolve further as users look for ‘killer’ applications Sun, Oct 13, 2024, 12:19 PM