by Suryaa Desk | Sat, Nov 23, 2024, 01:11 PM
అవినీతితో వైఎస్ జగన్ రాష్ట్ర ప్రతిష్ఠను మంటగలిపారని ముఖ్యమంత్రి చంద్రబాబు మండిపడ్డారు. ఎవరు తప్పుచేసినా వదిలే ప్రసక్తి లేదన్నారు. వదిలేస్తే మరొకరు తప్పు చేసే పరిస్థితి వస్తుందని తెలిపారు. శుక్రవారం సాయంత్రం అసెంబ్లీ ప్రాంగణంలో ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. అంతకుముందు టీడీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలోనూ ఆయన పాల్గొన్నారు. ‘జగన్-అదానీ... లంచాల కహానీ’పై చంద్రబాబు స్పందించారు.
సౌర విద్యుత్ టెండర్ల వ్యవహారంలో గత జగన్ ప్రభుత్వానికి రూ.1,750 కోట్ల మేర ముడుపులు అందాయని అమెరికా కోర్టులో అక్కడి ప్రభుత్వ సంస్థలు చార్జిషీటు దాఖలు చేసిన నేపథ్యంలో జగన్‌ను ఇక్కడ ప్రాసిక్యూట్ చేస్తారా అని మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా... ‘‘అన్ని కోణాల నుంచీ పరిశీలిస్తున్నాం. ఏం చేయగలమన్నదానిపై న్యాయ నిపుణుల సలహా తీసుకుంటున్నాం. ఇక్కడ మన పరిధి ఎంతవరకూ ఉంది.. చట్టపరంగా ఏం చేయగలమో.. నిపుణుల అభిప్రాయం తెలుసుకున్నాక నిర్ణయానికి వస్తాం’ అని చంద్రబాబు బదులిచ్చారు. అదే సమయంలో తప్పు చేసింది ఎవరైనా వదిలేది లేదని స్పష్టం చేశారు. జగన్ ప్రభుత్వ హయాంలో సెకీతో కుదుర్చుకున్న ఒప్పందాలు రాష్ట్రానికి భారంగా మారే ప్రమాదముందని వార్తలు వస్తున్న నేపథ్యంలో వాటిని రద్దు చేస్తారా అన్న ప్రశ్నకు.. ఆయన ఆచితూచి స్పందించారు. ‘పెట్టుబడులు పెట్టేవారి విశ్వాసం దెబ్బ తినకుండా.. అదే సమయంలో ప్రజల కోణంలో కూడా ఆలోచించి నిర్ణయానికి వస్తాం. అన్ని వైపుల నుంచీ ఆలోచిస్తాం’ అని తెలిపారు.
Latest News