by Suryaa Desk | Sat, Nov 23, 2024, 01:10 PM
వైసీపీ ప్రభుత్వం అన్ని వ్యవస్థలను అస్తవ్యస్తం చేసినట్లుగానే జాతీయ ఉపాధి హామీ పథకాన్ని కూడా భ్రష్టు పట్టించిందని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఆరోపించారు. ఇటీవల సమీక్షలు నిర్వహించినప్పుడు ఈ పథకం అమల్లో అనేక అవకతవకలు బయటకు వచ్చాయని, వాటిపై లోతుగా విచారణ చేసి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఉపాధి హామీ పథకం కింద గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి కుటుంబానికి 100 రోజుల ఉపాధి కల్పిస్తున్నామని చెప్పారు. కొత్తగా పేర్లు నమోదు చేసుకున్నవారికి 15 రోజుల్లోపు జాబ్ కార్డులు అందిస్తున్నామన్నారు.
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రూ.4,500 కోట్లతో 30 వేల అభివృద్ధి పనులు చేసి 7 కోట్ల పని దినాలు కల్పించామని తెలిపారు. ‘పల్లె పండుగ’ కార్యక్రమంలో 3 వేల కిలోమీటర్ల సీసీ రోడ్లు, 500 కిలోమీటర్ల బీటీ రోడ్లు, 20 వేల మినీ గోకులం షెడ్లు, అవసరమైనచోట్ల వాటర్ హార్వెస్టింగ్ పనులు చేపట్టామని, వచ్చే సంక్రాంతిలోపు ఈ పనులన్నీ పూర్తి చేయాలనే బలమైన సంకల్పంతో ముందుకు వెళ్తున్నామని తెలిపారు. ప్రతి పంచాయతీలో సిటిజన్ ఇన్ఫర్మేషన్ బోర్డులు ఏర్పాటు చేశామని, జాబ్‌కార్డుల జారీలో అవకతవకలను అరికడతామన్నారు. 100 రోజులు పని కల్పించలేకపోతే పరిహారం చెల్లిస్తామన్నారు. తీరప్రాంత కోత నియంత్రణకు సాధ్యాసాధ్యాలను అధ్యయనం చేస్తామని పవన్ కల్యాణ్ వెల్లడించారు.
Latest News