by Suryaa Desk | Sat, Nov 23, 2024, 10:08 PM
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్త ఎయిర్‌పోర్టులపై ఫోకస్ పెట్టింది. రాష్ట్రంలో కొత్తగా మరో ఆరు విమానాశ్రయాలకు ప్రతిపాదనలు తీసుకొచ్చారు. అయితే విజయనగరం జిల్లాలో భోగాపురం ఎయిర్‌పోర్టు నిర్మాణం వేగవంతంగా సాగుతుండగా.. మరో ఎయిర్‌పోర్టు కూడా తెరపైకి వచ్చింది. విజయనగరం జిల్లా బాడంగిలోని ఎయిర్ స్ట్రిప్ (మినీ విమానాశ్రయం)ను తిరిగి నిర్మించాలనే ప్రతిపాదనలు మొదలయ్యాయి. బ్రిటిష్ హయాంలో రక్షణ అవసరాలకు వినియోగించిన ఈ ఎయిర్‌పోర్టును మళ్లీ అందుబాటులోకి తీసుకురావాలని భారత నావికాదళం ఆలోచన చేస్తోంది. భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని.. శత్రు దేశాల ముప్పు ఎదుర్కొనేందుకు విశాఖపట్నానికి పొరుగునే బాడంగిలో మరో నేవీ ఆర్మమెంట్ డిపో (ఆయుధ కేంద్రం-ఎన్‌ఏడీ) నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.
బాడంగి భూములు భోగాపురం విమానాశ్రయానికి 70 కి.మీ దూరంలో ఉన్నాయి.. అలాగే నేషనల్ హైవేకు 7 కి.మీ., డొంకినవలస రైల్వే స్టేషన్‌కు 3 కి.మీ దూరంలో ఉన్నాయి. దీంతో ఈ మినీ ఎయిర్‌పోర్టును అందుబాటులోకి తీసుకొస్తే ఉపయోగకరంగా ఉంటుందని నేవీ భావిస్తోంది. అంతేకాదు ఫైటర్ జెట్ల పైలట్లకు శిక్షణ ఇచ్చేందుకు బాడంగి విమానాశ్రయం అనుకూలంగా ఉంటుందని భావిస్తున్నారు. అంతేకాదు నౌకలకు కావాల్సిన సరకులు అందించడానికి ఎయిర్‌వే, డిఫెన్స్ ఇండస్ట్రియల్ కారిడార్లకు సామగ్రి తరలించడానికి సమీపంలో రైల్వే మార్గం ఉండటం అనుకూలంగా ఉంటుందని చెబుతున్నారు.
బ్రిటిష్ హయాంలో బాడంగిలో ఎయిర్ స్ట్రిప్‌ను 90 ఏళ్ల క్రితం నిర్మించినట్లు చెబుతున్నారు. ఆ సమయంలో యుద్ధ అవసరాలు, సరకుల రవాణాకు 227 ఎకరాల్లో రన్‌వే, ఏటీసీ, బంకర్ల నిర్మాణం చేశారు. రెండో ప్రపంచ యుద్ధం సమయంలో ఈ విమానాశ్రయం కీలకంగా మారింది. అయితే 1946లో ఈ ఎయిర్ స్ట్రిప్‌ను మూసివేయగా.. ఆ తర్వాత దీనిని ఎఫ్‌సీఐ వరి, గోధుమలు నిల్వ చేసేందుకు కొంత కాలంపాటు ఉపయోగించింది. ఈ భూముల్లో రైతులు ప్రస్తుతం పంటలు సాగు చేస్తున్నారు. ఈ ఎయిర్ స్ట్రిప్‌కు ఇరువైపులా భూములను ‘టి’ ఆకారంలో సేకరించాలని నేవీ అధికారులు కోరుతున్నారు.
ఇక్కడ ఎయిర్‌స్ట్రిప్‌కు ఉన్న 227 ఎకరాలతోపాటు అదనంగా మరో 1700 ఎకరాలు అవసరమని ప్రతిపాదనలు చేశారు. ఆ సమీపంలోని మల్లంపేట, పూడివలస, ముగడ, రామచంద్రాపురం, కోడూరు పరిధిలో భూముల సేకరణకు ఓ ధర నిర్ణయించే అవకాశం ఉందంటున్నారు. అయితే తాము భూములిచ్చేందుకు సిద్దమని.. తమకు తగిన రీతిలో పరిహారం అందించడంతోపాటు తమ పిల్లలకు ఉద్యోగ అవకాశాలు కూడా ఇవ్వాలని కోరుతున్నారని చెబుతున్నారు. అంతేకాదు నేవీ అధికారులు ఈ ప్రాంతానికి తరచూ వస్తూ వెళ్లడంతో బాడంగి విమానాశ్రయ పునరుద్ధరణపై త్వరలో ఒక క్లారిటీ వస్తుందని చెబుతున్నారు. ఈ విమానాశ్రయాన్ని పునరుద్ధరిస్తే దీనికి మరింత ప్రాధాన్యం ఏర్పడుతుంది అంటున్నారు.
Latest News