by Suryaa Desk | Sat, Nov 23, 2024, 10:10 PM
విశాఖపట్నంలో ఆటో డ్రైవర్‌కు పోలీసులు భారీ జరిమానా విధించారు. డ్రైవర్ నిబంధనలకు విరుద్ధంగా, పరిమితికి మించి ఆటోలో స్కూల్ విద్యార్థులను తీసుకెళ్తున్నట్లు గుర్తించారు. ఆటో డ్రైవర్‌కు రూ.10 వేలు జరిమానా విధించినట్లు వన్‌టౌన్ ట్రాఫిక్ సీఐ చెప్పారు. వన్‌టౌన్ ట్రాఫిక్ పోలీసులు వాహన తనిఖీలు చేపట్టారు.. ఆ సమయంలో పూర్ణమార్కెట్ నుంచి జగదాంబకూడలికి వెళ్తున్న ఆటోను ఆపారు.. అందులో ఏకంగా 20 మంది విద్యార్థులు ఉన్నట్లు గుర్తించారు. ఆటోలో ఏకంగా 20మందిని చూసి పోలీసులు సైతం అవాక్కయ్యారు.. అంతమందిని ఎలా ఎక్కించావురా బాబూ అంటూ ప్రశ్నించారు. ఆ డ్రైవర్‌కు రూ.10వేల జరిమానా విధించారు. విద్యార్థుల భద్రతపై తల్లిదండ్రులు, స్కూళ్ల యాజమాన్యాలు ప్రత్యేకంగా దృష్టి సారించాలని సీఐ కోరారు. ఆటో డ్రైవర్లు పరిమితికి మించి స్కూల్ విద్యార్థుల్ని, ప్రయాణికుల్ని ఎక్కించుకుంటే చర్యలు తప్పవని హెచ్చరించారు. అంతేకాదు ఇకపై వాహనాల తీనిఖీలను ముమ్మరం చేస్తామని.. ఇలా నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని వార్నింగ్ ఇచ్చారు పోలీసులు.
అపరిచితుల నుంచి వస్తున్న మెసేజ్‌లకు స్పందించొద్దని సూచిస్తున్నారు పోలీసులు. వారు ఏటీఎం పిన్, పాస్‌వర్డ్‌లను అడిగితే చెప్పొద్దని..సైబర్ నేరాలపై ఫిర్యాదుల కోసం 1930కి కాల్ చేయాలని సూచించారు. సైబర్ నేరగాళ్లు మొబైల్‌లోకి మాల్వేర్ ఇన్స్టాల్ చేసి, రిమోట్ యాక్సెస్ సాయంతో తెలియకుండానే అకౌంట్లలో డబ్బుల్ని దోచేస్తారు.. కాబట్టి ఓటీపీ, పిన్, పాస్‌వర్డ్‌లను ఎవరికి చెప్పొద్దని.. ఎలాంటి లింక్‌లు క్లిక్ చేయొద్దని సూచిస్తున్నారు. సైబర్ నేరగాళ్ల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు.
విశాఖపట్నంలో కొబ్బరితోట ప్రాంతానికి చెందిన బాలికను మోసం చేసిన రౌడీషీటర్‌పై టూటౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈనెల 14న స్థానికంగా నివాసం ఉండే బాలిక కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు అందింది. వెంటనే గాలింపు చేపట్టిన పోలీసులు.. 20న విజయనగరంలో బాలికను గుర్తించి ప్రశ్నించారు. అయితే కొబ్బరితోట ప్రాంతానికి చెందిన రౌడీషీటర్ దినేష్‌కుమార్ బాలికకు మాయమాటలు చెప్పి విజయనగరం తీసుకెళ్లాడని ఆమె చెప్పింది. తనను ఓ ఇంట్లో ఉంచి, లైంగిక దాడికి పాల్పడినట్లు చెప్పడంతో.. నిందితుడిని అరెస్టు చేసి పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
మరోవైపు విశాఖపట్నంలో ఓ బాల్య వివాహాన్ని అధికారులు అడ్డుకున్నారు. గోవాడకు చెందిన యువకుడితో ముద్దుర్తికి చెందిన 15 ఏళ్ల బాలికతో వివాహం చేసేందుకు పెద్దలు ముహూర్తం ఫిక్స్ చేశారు. ఈ విషయం తెలియడంతో ఐసీడీఎస్ రావికమతం ప్రాజెక్టు అధికారిణి ఉషారాణి పోలీసులతో గోవాడ వెళ్లారు. అక్కడ బాలికకు వివాహం చేయడం చట్టరీత్యా నేరమని కుటుంబ సభ్యులకు చెప్పారు.. బాలిక తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇచ్చి వివాహాన్ని ఆపారు.
Latest News