by Suryaa Desk | Sat, Nov 23, 2024, 10:43 PM
మహారాష్ట్రలో బీజేపీ-షిండే శివసేన-అజిత్ పవార్ ఎన్సీపీ నేతృత్వంలోని మహాయుతి కూటమి ఘన విజయాన్ని సాధించి తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంది. ఈ నేపథ్యంలోనే మహారాష్ట్ర ముఖ్యమంత్రి పీఠంపై ఎవరు కూర్చుంటారు అనే సందేహాలు ఇప్పుడు అంతటా వ్యక్తం అవుతున్నాయి. ఇక మాజీ సీఎం, ప్రస్తుత డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ముఖ్యమంత్రి కుర్చీ దక్కించుకుంటారని బీజేపీ వర్గాలు పేర్కొంటుండగా.. ప్రస్తుత సీఎం ఏక్నాథ్ షిండే మాట్లాడుతూ.. ఎక్కువ సీట్లు వచ్చిన పార్టీకే సీఎం పదవి ఇవ్వాల్సిన అవసరం లేదని తెలిపారు. ఇక ఎన్సీపీ శ్రేణులు మాత్రం అజిత్ పవార్‌ను సీఎం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే దేవేంద్ర ఫడ్నవీస్ కీలక వ్యాఖ్యలు చేశారు.
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని మహాయుతి కూటమి ఘన విజయం సాధించడంపై ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం, బీజేపీ సీనియర్ నేత, మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ హర్షం వ్యక్తం చేశారు. మహాయుతి కూటమి విజయానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికి ఫడ్నవీస్ ధన్యవాదాలు తెలిపారు. మరీ ముఖ్యంగా మహిళా ఓటర్లకు ప్రత్యేక ధన్యవాదాలు చెప్పారు. ప్రస్తుతం మహారాష్ట్ర అంతా ఒక్కటిగా ఉందని.. మహారాష్ట్ర మొత్తం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వెంట నిలిచిందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఎంపికపై దేవేంద్ర ఫడ్నవీస్ కీలక వ్యాఖ్యలు చేశారు.
మహారాష్ట్ర సీఎం పదవిపై మహాయుతి కూటమిలో ఎలాంటి గొడవలు లేవని దేవేంద్ర ఫడ్నవీస్ స్పష్టం చేశారు. బీజేపీ, షిండే శివసేన, అజిత్ పవార్ ఎన్సీపీ పార్టీలు కలిసి.. పరస్పర అంగీకరాంతో ముఖ్యమంత్రిని ఎన్నుకుంటామని తేల్చి చెప్పారు. ఈ సందర్భంగా.. మహారాష్ట్రలో షిండే శివసేననే అసలు శివసేన అని మరాఠా ప్రజలు తీర్పును ఇచ్చారని తెలిపారు. ఇక మహారాష్ట్రలో ఈవీఎంలు ట్యాంపరింగ్ చేశారని షిండే శివసేన పార్టీ ఎంపీ సంజయ్ రౌత్ చేసిన ఆరోపణలపై స్పందించిన ఫడ్నవీస్.. ఈవీఎంలు ఒక్క మహారాష్ట్రలోనే ఎలా ట్యాంపర్ అవుతాయో జార్ఖండ్‌లో ఎందుకు కాలేదో విపక్షాలే చెప్పాలని ఎద్దేవా చేశారు.
ఇక మహారాష్ట్ర ఎన్నికల్లో మహాయుతి కూటమి గెలుపు ఖరారు కావడంతో ఫడ్నవీస్ ఒక ట్వీట్ పెట్టారు. ఒక్కరు ఉంటేనే భద్రంగా ఉంటుంది.. అది ప్రధాని మోదీ వల్లే సాధ్యం అంటూ ట్వీట్ చేశారు. ఈ పోస్ట్‌కు మహారాష్ట్ర హ్యాష్‌ట్యాగ్‌ను జోడించారు. తాజాగా సీఎం సీటుపై మహారాష్ట్రలో తీవ్ర ఉత్కంఠ రేపిన వేళ.. ఫడ్నవీస్ చేసిన పోస్ట్ ప్రస్తుతం తెగ వైరల్‌గా మారింది.
Latest News