by Suryaa Desk | Sat, Nov 23, 2024, 10:42 PM
ఇటీవల జరిగిన మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఇవాళ వెలువడ్డాయి. ఇక ఈ రెండు రాష్ట్రాల్లో ప్రస్తుతం అధికారంలో ఉన్న కూటములు తిరిగి అధికారాన్ని చేజిక్కించుకున్నాయి. మహారాష్ట్రలో బీజేపీ-షిండే శివసేన-అజిత్ పవార్ ఎన్సీపీ నేతృత్వంలోని మహాయుతి కూటమి మళ్లీ అధికారంలోకి రాగా.. జార్ఖండ్‌లో జేఎంఎం-కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి గెలుపొందింది. ఇటీవల విడుదలైన ఎగ్జిట్ పోల్స్ అన్నీ ఈ రెండు రాష్ట్రాల్లో బీజేపీ కూటమిదే అధికారం అని ముక్తకంఠంతో చెప్పగా.. అందులో మహారాష్ట్రలో అంచనాలు అందుకోగా.. జార్ఖండ్‌లో మాత్రం భిన్నంగా వచ్చాయి. ఈ క్రమంలోనే తాజాగా వెలువడిన రెండు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ట్వీట్ చేశారు.
అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై స్పందించిన ప్రధాని మోదీ.. ఈ ఎన్నికల్లో బీజేపీని గెలిపించేందుకు క్షేత్రస్థాయిలో పనిచేసిన ప్రతీ కార్యకర్తను చూసి తాను గర్వపడుతున్నట్లు చెప్పారు. మహారాష్ట్రలోని సోదర, సోదరీమణులకు ముఖ్యంగా యువతకు, మహిళలకు తన హృదయపూర్వక ధన్యవాదాలు చెప్పారు. మహారాష్ట్ర అభివృద్ధికి మహాయుతి కూటమి ప్రభుత్వం ఇలాగే పనిచేస్తుందని స్పష్టం చేశారు.
మహారాష్ట్రలో అభివృద్ధి, సుపరిపాలనలు గెలిచాయని ప్రధాని ట్వీట్ చేశారు. చరిత్రాత్మక విజయాన్ని కట్టబెట్టిన మహారాష్ట్ర ఓటర్లు.. ముఖ్యంగా మహిళలు, యువతకు ధన్యవాదాలు తెలిపారు. కలిసికట్టుగా ఉంటే మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించగలమని పేర్కొన్నారు. మహారాష్ట్ర అభ్యున్నతికి మహాయుతి కృషి చేస్తుందని తాను హామీ ఇస్తున్నట్లు చెప్పారు. ఈ సందర్భంగా జై మహారాష్ట్ర అంటూ తన ట్వీట్‌ను ముగించారు.
మరోవైపు.. జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన జేఎంఎం నేతృత్వంలోని ఇండియా కూటమికి ప్రధాని మోదీ అభినందనలు తెలిపారు. ప్రజల సమస్యలను లేవనెత్తడంలో, రాష్ట్రం కోసం పని చేయడంలో ఎల్లప్పుడూ ముందుంటామని పేర్కొన్నారు. అంతేకాకుండా దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ, లోక్‌సభ ఉప ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థులను గెలిపించడం పట్ల ప్రధాని మోదీ ధన్యవాదాలు చెప్పారు. ప్రజల కలలు, ఆకాంక్షలను నెరవేర్చడంలో తాము వెనక్కి తగ్గబోమని చెప్పారు.
Latest News