వయనాడ్ ప్రజలను ఉద్దేశించి ప్రియాంక గాంధీ ఎమోషనల్ ట్వీట్
 

by Suryaa Desk | Sat, Nov 23, 2024, 10:41 PM

ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీ చేసిన కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా.. రికార్డు స్థాయి ఘన విజయాన్ని నమోదు చేశారు. గతంలో వయనాడ్ ఎంపీగా గెలిచిన రాహుల్ గాంధీ సాధించిన ఓట్ల కంటే అధిక ఓట్లు దక్కించుకుని.. తిరుగులేని విజయాన్ని దక్కించుకుని.. సగర్వంగా లోక్‌సభలో అడుగుపెట్టనున్నారు. ఈ సందర్భంగా తనను గెలిపించిన వయనాడ్ ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. తనపై వయనాడ్ ప్రజలు ఉంచిన విశ్వాసానికి ఉప్పొంగిపోతున్నట్లు ఆనందం వ్యక్తం చేశారు. పార్లమెంటులో వయనాడ్ ప్రజల గళం వినిపించేందుకు తాను ఎదురుచూస్తున్నట్లు ప్రియాంక గాంధీ వాద్రా ట్వీట్ చేశారు.


ఉపఎన్నికలో ఇంతటి ఘన విజయాన్ని తనకు అందించినందుకు వయనాడ్ ప్రజలకు కృతజ్ఞతలు అని ప్రియాంక గాంధీ ట్వీట్‌లో పేర్కొన్నారు. ఇది వయనాడ్ ప్రజల విజయమని భావించేలా.. వారి కలలు, ఆశలను అర్థం చేసుకున్న వ్యక్తిగా పార్లమెంట్‌లో తన గళం వినిపిస్తానని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. తనకు ఈ గౌరవాన్ని అందించి.. తనపై అపారమైన ప్రేమను చూపినందుకు వయనాడ్ ఓటర్లకు ఆమె ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా యూడీఎఫ్‌లోని తన సహచరులు, కేరళవ్యాప్తంగా ఉన్న నేతలు, కార్యకర్తలు, వాలంటీర్లు.. తన గెలుపు కోసం ఎంతో కష్టపడి పనిచేసిన తన సిబ్బందికి ప్రియాంక గాంధీ థ్యాంక్స్ చెప్పారు.


తన కోసం రోజుకు 12 గంటలు విశ్రాంతి లేకుండా తనతో కలిసి ప్రయాణించారని.. మనం అందరం విశ్వసించే ఆశయాల కోసం నిజమైన సైనికుల్లా పనిచేశారని ప్రియాంక గాంధీ తెలిపారు. తన తల్లి, భర్త, పిల్లలు అందించిన ప్రేమ, ధైర్యానికి ఎన్ని కృతజ్ఞతలు చెప్పినా సరిపోవని పేర్కొన్నారు. ఇక తన సోదరుడు రాహుల్ గాంధీని ఉద్దేశించి మాట్లాడిన ప్రియాంక గాంధీ.. అందరికంటే ధైర్యవంతుడని కొనియాడారు. తనకు దారిచూపి.. నా వెన్నంటి నిలిచినందుకు ధన్యవాదాలు అంటూ ప్రియాంక గాంధీ తన ట్వీట్‌లో పేర్కొన్నారు.


తాజాగా వెలువడిన వయనాడ్ ఉప ఎన్నికలో ప్రియాంక గాంధీ.. తన సమీప అభ్యర్థిపై 4.04 లక్షలకు పైగా ఓట్ల తేడాతో బంపర్ విజయాన్ని నమోదు చేశారు. దీంతో ఈ ఏడాది జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ఇదే వయనాడ్ నుంచి తన సోదరుడు రాహుల్‌ గాంధీ సాధించిన 3.64 లక్షల ఓట్ల మెజార్టీని దాటేశారు. ఇక వయనాడ్‌లో 2019 లోక్‌సభ ఎన్నికల్లో సీపీఐ నేత పీపీ సునీర్‌పై 4.3 లక్షల మెజార్టీతో రాహుల్‌ గాంధీ విజయం సాధించారు.


ఈ సందర్భంగా జార్ఖండ్‌లో విజయం సాధించిన ఇండియా కూటమికి ప్రియాంక గాంధీ అభినందనలు తెలియజేశారు. జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్, ఆయన భార్య కల్పనా సోరెన్, జార్ఖండ్ కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు, ఇండియా కూటమిలో ఉన్న ప్రతీ ఒక్కరికి ఆమె శుభాకాంక్షలు తెలిపారు. జార్ఖండ్‌లో ఇండియా కూటమి చేసిన అభివృద్ధిని ప్రజలు అంగీకరించారని తెలిపారు. ఈ సందర్భంగా జార్ఖండ్ ప్రజలకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్పారు. మరోవైపు.. మహారాష్ట్రలో తాము ఊహించని ఫలితాలు వచ్చాయని పేర్కొన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజలే అంతిమ నిర్ణయాధికారులు అని.. ఎన్నికల్లో గెలుపు, ఓటములు ఉంటాయని తెలిపారు. ప్రజల కోసం కాంగ్రెస్పార్టీ పోరాడుతూనే ఉంటుందని వెల్లడించారు. గెలుపోటముల నుంచి తాము నేర్చుకుంటామని చెప్పారు. ఇండియా కూటమికి మహారాష్ట్రలో మద్దతు తెలిపిన వారందరికీ ధన్యవాదాలు తెలియజేశారు. ప్రజాస్వామ్యం కలకాలం వర్ధిల్లాలి అని ప్రియాంకా గాంధీ ట్వీట్ చేశారు.

Latest News
Couple arrested for murder of Kerala woman real estate broker Mon, Nov 25, 2024, 05:00 PM
US: Bird flu virus detected in raw milk from dairy farm in California Mon, Nov 25, 2024, 04:59 PM
Lalan Singh's remarks on minority community 'promotes hatred': Tejashwi Yadav Mon, Nov 25, 2024, 04:56 PM
AIIMS adds 2 new MRI machines to provide more efficient & timely radiology diagnosis Mon, Nov 25, 2024, 04:54 PM
Tribal groups agree to 7-day ceasefire after over 65 killed in Pakistan Mon, Nov 25, 2024, 04:53 PM