by Suryaa Desk | Sun, Nov 24, 2024, 10:05 AM
నేటి ఉరుకుల పరుగుల బిజీ జీవితంలో చాలా మంది నిత్యం ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. పలు సందర్భాల్లో ఒత్తిడిని ఎదుర్కొంటుండడం వల్ల చాలా మంది సంతోషంగా ఉండడం లేదు. ఆందోళన నెలకొంటోంది. దీంతో డిప్రెషన్ బారిన పడుతున్నారు. అయితే ఒత్తిడి నుంచి బయట పడాలంటే శరీరం హ్యాపీ హార్మోన్లను ఉత్పత్తి చేయాల్సి ఉంటుంది. అందుకు గాను పలు సూచనలు పాటించాలి. దీంతో హ్యాప్పీ హార్మోన్లు అయిన సెరొటోనిన్, డోపమైన, ఎండార్ఫిన్లు, ఆక్సిటోసిన్ రిలీజ్ అవుతాయి. ఇవి మన మూడ్‌ను మారుస్తాయి. దీంతో హ్యాపీగా ఉంటాం. అందుకనే ఈ హార్మోన్లను హ్యాపీ హార్మోన్లు అంటారు. ఇక ఇవి శరీరంలో ఉత్పత్తి అవ్వాలంటే అందుకు ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
శారీరక వ్యాయామం, ముఖ్యంగా డ్యాన్సింగ్, యోగా వంటివి చేయడం వల్ల మన శరరీంలో ఎండార్ఫిన్లు రిలీజ్ అవుతాయి. ఇవి శరీరంలో సహజసిద్ధమైన పెయిన్ కిల్లర్స్ మాదిరిగా పనిచేస్తాయి. కనీసం రోజుకు 30 నిమిషాల పాటు వ్యాయామం చేస్తే మూడ్ మారుతుంది. ఇలాంటి కఠినతరమైన వ్యాయామాలు చేయవద్దు అనుకుంటే కనీసం సాధారణ వాకింగ్ చేసినా చాలు, రోజుకు 30 నిమిషాల పాటు నడిస్తే మీ మూడ్‌లో కచ్చితంగా మార్పు వస్తుంది. మీ శరీరంలో హ్యాప్పీ హార్మోన్లు రిలీజ్ అయి మీరు హ్యాపీగా ఉంటారు.
రోజుకు కనీసం 10 నుంచి 15 నిమిషాల పాటు సూర్య రశ్మిలో గడిపితే చాలు, మన శరీరంలో సెరొటోనిన్ రిలీజ్ అవుతుంది. దీంతో మైండ్ ప్రశాంతంగా మారుతుంది. ఒత్తిడి మొత్తం తగ్గిపోతుంది. ఉదయం పూట ఎండలో కాసేపు నిలుచుంటే ఇంకా ఎక్కువ ఫలితం ఉంటుంది. దీని వల్ల నిద్రలేమి సమస్య తగ్గుతుంది. అలాగే ఎండలో నిలబడడం వల్ల శరీరంలో విటమిన్ డి కూడా తయారవుతుంది. ఇది మనల్ని ఆరోగ్యంగా ఉంచుతుంది.
డార్క్ చాకొలెట్‌లలో 70 శాతం కొకొవా ఉంటుంది. అందువల్ల ఈ చాకొలెట్లను తింటే డోపమైన్ ఉత్పత్తి పెరుగుతుంది. దీంతో మానసిక ప్రశాంతత లభిస్తుంది. చిన్నపాటి చాకొలెట్ తిన్నా చాలు, మూడ్ మారుతుంది. ఒత్తిడి, ఆందోళన నుంచి బయట పడతారు. రోజూ 10 నుంచి 15 నిమిషాల పాటు నవ్వడం వల్ల కూడా మన శరీరంలో హ్యాపీ హార్మోన్లు ఉత్పత్తి అవుతాయి. ఇవి మన మూడ్‌ను మారుస్తాయి. ఒత్తిడి, ఆందోళన నుంచి బయట పడేస్తాయి. డిప్రెషన్ తగ్గుతుంది. కనుకనే డాక్టర్లు తరచూ నవ్వాలని చెబుతుంటారు.
మీకు ఇష్టమైన వారిని కౌగిలించుకోవడం వల్ల కూడా మన శరీరంలో హ్యాపీ హార్మోన్లు ఉత్పత్తి అవుతాయి. ఇవి మానసిక ప్రశాంతతను కలగజేస్తాయి. ఒత్తిడి, ఆందోళన, డిప్రెషన్ తగ్గుతాయి. మీకు ఎవరైనా ఏదైనా పని చేసి పెడితే వారికి గిఫ్ట్ ఇచ్చి లేదా కృతజ్ఞతా పూర్వకంగా ఒక థాంక్స్ చెప్పండి. దీంతో మీలోనే కాదు, ఎదుటివారిలోనూ హ్యాపీ హార్మోన్లు రిలీజ్ అవుతాయి. ఇవి మిమ్మల్ని, ఎదుటి వారిని సంతోషంగా ఉంచుతాయి. ఒత్తిడిని తగ్గిస్తాయి. వాల్ నట్స్, అవిసె గింజలు, సముద్రపు చేపలు వంటి వాటిల్లో ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు సమృద్ధిగా ఉంటాయి. ఇవి సెరొటోనిన్ ఉత్పత్తిలో కీలకపాత్ర పోషిస్తాయి. కనుక ఈ ఆహారాలను తరచూ తింటుంటే మూడ్ మారుతుంది. హ్యాప్పీగా ఉండవచ్చు. ఇలా పలు రకాల ఆహారాలను తీసుకుంటూ, పలు సూచనలు పాటిస్తే ఒత్తిడి నుంచి బయట పడవచ్చు. డిప్రెషన్‌ను తగ్గించుకోవచ్చు. ఎల్లప్పుడూ సంతోషంగా ఉండవచ్చు.