by Suryaa Desk | Sun, Nov 24, 2024, 03:41 PM
కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన పిలుపు మేరకు రాష్ట్రంలో ప్రాథమిక వైద్యసేవలను బలోపేతం చేసేందుకు త్వరలో ఐఎంఏ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా పల్లెకు పోదాం (ఆవో గావ్ ఛలే) కార్యక్రమానికి శ్రీకారం చుడతామని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) రాష్ట్ర నూతన అధ్యక్షుడు, గుంటూరుకు చెందిన ఈఎన్‌టీ సర్జన్ డాక్టర్ గార్లపాటి నందకిషోర్ వెల్లడించారు. గుంటూరులో జరుగుతున్న ఐఎంఏ రాష్ట్ర 66వ వార్షిక వైద్య సదస్సులో శనివారం రాత్రి ఆయన ఐఎంఏ రాష్ట్ర శాఖ అధ్యక్షుడిగా పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఐఎంఏ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ ఆర్‌వీ అశోకన్, ఆయన చేత అధ్యక్షుడిగా ప్రమాణం చేయించారు. ఈ సందర్భంగా డాక్టర్ నందకిషోర్ మాట్లాడుతూ ఇటీవల ప్రధానమంత్రి మోదీ వైద్యులకు ఆవో గావ్ ఛలే కార్యక్రమానికి పిలుపునిచ్చినట్టు తెలిపారు. ఇదే స్ఫూర్తితో మన రాష్ట్రంలోనూ పల్లెకు పోదాం కార్యక్రమం ప్రారంభిస్తామని తెలిపారు.
దేశవ్యాప్తంగా వైద్యులపై జరుగుతున్న దాడులను నిరోధించేందుకు కేంద్రం కఠినమైన చట్టం తీసుకురావాలని డాక్టర్ నందకిషోర్ కోరారు. ప్రభుత్వం తగిన స్థలమిస్తే రాజధాని అమరావతిలో ఐఎంఏ రాష్ట్ర భవనాన్ని ఆధునికంగా నిర్మిస్తామని డాక్టర్ నందకిషోర్ విజ్ఞప్తి చేయగా, కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్ల శాఖ సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ సానులకూలంగా స్పందించారు. ఐఎంఏ వైద్యుల సమస్యలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం కోసం కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
Latest News