by Suryaa Desk | Sun, Nov 24, 2024, 10:18 PM
ఖలిస్థానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య వెనుక భారత్ ఏజెంట్ల హస్తముందని కెనడా చేసిన ఆరోపణలతో ఇరు దేశాల మధ్య ఏడాదికిపైగా ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. కెనడా భూభాగంలో హింసకు జరుగుతోన్న కుట్రలో భారత ప్రధాని, విదేశాంగ మంత్రుల సైతం భాగమైనట్లు అక్కడ మీడియా ఇటీవల ప్రచురించిన కథనాలపై ఆ దేశ ప్రధాన మంత్రి జస్టిన్ ట్రూడో (Justin Trudeau) అసహనం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో తన సొంత ఇంటెలిజెన్స్ అధికారులనే క్రిమినల్స్‌గా ఆయన అభివర్ణించారు. ఈ మేరకు మీడియా అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానం ఇచ్చారు.
‘దురదృష్టవశాత్తు కొందరు క్రిమినల్స్ అత్యంత కీలక సమాచారాన్ని మీడియాకు లీక్ చేయడం.. దాని ఆధారంగా తప్పుడు కథనాలు ప్రచురించడం చూశాను. అందుకే విదేశీ జోక్యంపై జాతీయ దర్యాప్తు జరపాలి.. దీంతో పత్రికల్లో అత్యంత రహస్యమైన, తప్పుడు సమాచారం లీక్ అవకుండా నిరోధించగలం’ అని ట్రూడో వ్యాఖ్యానించారు. నిజ్జర్ హత్యపై ఇటీవల కెనడాకు చెందిన ‘ది గ్లోబ్ అండ్ మెయిల్’ పత్రిక ఓ కథనం ప్రచురించింది. ఈ హత్యకు కుట్రలో భారత జాతీయ భద్రతా సలహాదారు, విదేశాంగ శాఖ మంత్రిత్వశాఖ సైతం భాగమైనట్లు తమకు తెలిసిందని కెనడా సీనియర్ జాతీయ భద్రతా అధికారి వ్యాఖ్యలను ఉటంకించింది.
అంతేకాదు, ఏకంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ పేరును కథనంలో ప్రస్తావించడం గమనార్హం. దీనిపై తీవ్రంగా స్పందించిన భారత్.. ఇవన్నీ తప్పుడు కథనాలని మండిపడింది. ఈ క్రమంలోనే మీడియాలో ప్రచురితమైన కథనాలు అవాస్తవమని కెనడా సర్కారు పేర్కొంది. భారత ప్రధాని, విదేశాంగ మంత్రులకు సంబంధం ఉన్నట్లు తాము ఎన్నడూ చెప్పలేదని, దీనికి భిన్నంగా ఎలాంటి కథనాలు ప్రచురితమైన ఊహాజనితమని స్పష్టం చేసింది.
ఖలిస్థానీ వేర్పాటువాది హరదీప్ సింగ్ నిజ్జర్ ను గతేడాది జూన్ 16న బ్రిటిష్ కొలంబియాలోని ఓ గురుద్వార వద్ద గుర్తుతెలియని వ్యక్తులు కాల్పులు జరిపి హత్య చేసిన విషయం తెలిసిందే. ఈ హత్య వెనక భారత ప్రభుత్వ ఏజెంట్ల హస్తం ఉందంటూ కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో గతేడాది ఆ దేశ పార్లమెంట్లో చేసిన వ్యాఖ్యలతో ఇరు దేశాల మధ్య దౌత్య యుద్దం మొదలైంది. ఈ క్రమంలోనే ఇటీవల నిజ్జర్ హత్య కేసు అనుమానితుల జాబితాలో భారత హైకమిషనర్ సంజయ్‌కుమార్ వర్మ పేరును చేర్చడంతో మరింత ఆజ్యం పోసింది. ఈ పరిణామాల నేపథ్యంలో సంజయ్ వర్మ సహా ఆ దేశంలోని భారత దౌత్యవేత్తలను కేంద్రం వెనక్కి రప్పించింది. అదే సమయంలో ఢిల్లీలోని కెనడా తాత్కాలిక హైకమిషనర్ సహా ఆరుగురు దౌత్యవేత్తల్ని బహిష్కరించింది.
Latest News