by Suryaa Desk | Sun, Nov 24, 2024, 10:19 PM
అమెరికా ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ విజయం సాధించడంతో విదేశీ విద్యార్థులు, ఉద్యోగుల విషయంలో ఎటువంటి బాంబు పేల్చుతారోనని భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. ట్రంప్ తన ఎన్నికల ప్రచారంలో వలసల అంశాన్ని ప్రధానంగా ప్రస్తావించడమే ఇందుకు కారణం. ఇమ్మిగ్రేషన్ విధానంలో సమూల మార్పులు తీసుకొస్తానని ఆయన ప్రకటించారు. తన క్యాబినెట్‌లో వలసలను తీవ్రంగా వ్యతిరేకించే వ్యక్తికే ఆ శాఖకు మంత్రిగా నియమించారు. ఈ నేపథ్యంలో అమెరికా యూనివిర్సిటీలు, కాలేజీలు అప్రమత్తమయ్యాయి. అడ్మిషన్లు పొందిన అంతర్జాతీయ విద్యార్థులు, పరిశోధకులు, అధ్యాపకులకు ట్రావెల్ అడ్వైజరీలు జారీ చేస్తున్నాయి.
రీ-ఎంట్రీ వీసా కలిగి, వింటర్ వెకేషన్ సమయంలో అమెరికా వెలుపల ఉన్నవారు.. జనవరి 20న అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు చేపట్టేలోగా తిరిగి వచ్చేయాలని సూచిస్తున్నాయి. స్ప్రింగ్ అకడమిక్ సీజన్ ప్రారంభమయ్యే జనవరి 6లోపు అమెరికాకు రావాలని తమ విద్యార్థులకు నార్త్ ఈస్ట్రన్ యూనివర్సిటీ అలర్ట్ చేసింది. మసాచుసెట్స్, వెస్లియన్, మిడిల్‌టౌన్ తదితర యూనివర్సిటీలు సైతం తమ విద్యార్థులు, విజిటింగ్ స్కాలర్లు, అధ్యాపకులు, సిబ్బందికి ఇదే తరహా సూచనలు చేస్తూ లేఖలు రాశాయి. రెండోసారి అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇమ్మిగ్రేషన్‌కు సంబంధించి ట్రంప్ ఎలాంటి కఠిన నిబంధనలు అమల్లోకి తీసుకొస్తారని వర్సిటీలు ముందుగానే జాగ్రత్త పడుతున్నాయి.
2016 ఎన్నికల్లో విజయం సాధించి మొదటిసారి అధికారంలోకి వచ్చి.. 2017 జనవరి 20 బాధ్యతలు చేపట్టిన కొద్దిరోజుల్లోనే అమెరికాకు తిరిగివచ్చే అంతర్జాతీయ విద్యార్థులు, ఇతరులపై కొన్ని ఆంక్షలు విధించారు. ఇరాన్ సహా ఏడు ముస్లిం మెజారిటీ దేశాలకు చెందిన విద్యార్థులపై తాత్కాలిక నిషేధం విధించి... అమెరికాలోకి ప్రవేశించడం జాప్యమయ్యేలా నిబంధనలు తీసుకొచ్చారు. అప్పటి అనుభవాన్ని దృష్టిలో ఉంచుకుని అమెరికా యూనివర్సిటీలు, కాలేజీలు ఈసారి ముందే మేల్కొంటున్నాయి. ఇప్పుడు కూడా అలాంటి నిషేధాన్ని ట్రంప్ యంత్రాంగం అమలు చేస్తుందా? లేదా? అనే దానిపై తాము ఊహాగానాలు చేయడం లేదని, ఎలాంటి పరిస్థితులు ఏర్పడతాయోనని ముందుగానే సూచనలు చేస్తున్నట్లు పేర్కొంటున్నాయి.
శీతాకాలంలో అమెరికా నుంచి బయటకు వెళ్లినవారు జనవరి 19 నాటికి క్యాంపస్‌కు తిరిగి రావాలని విద్యార్థులకు వెస్లియన్ యూనివర్సిటీ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ వ్యవహారాల ఆఫీసు లేఖలు పంపింది. మొత్తంగా ట్రంప్ ప్రమాణ స్వీకారానికి ముందే అంతర్జాతీయ విద్యార్థుల్లో ఒత్తిడి, ఆందోళన కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో రెండు నెలల ప్రయాణాలకు సంబంధించి మార్పులు సూచిస్తున్నట్లు వర్సిటీల ప్రతినిధులు తెలిపారు.
Latest News