by Suryaa Desk | Sun, Nov 24, 2024, 10:21 PM
హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్- మల్కాజిగిరి జిల్లాల పరిధిలో రియల్ ఎస్టేట్ రంగం కొద్ది రోజులుగా స్తబ్దుగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అందుకు చాలా కారణాలే ఉన్నాయి. ప్రధానంగా ధరల పెరుగుదల, హైడ్రా కూల్చివేతలు వంటివి చెప్పవచ్చు. అయితే, ఈ ఏడాది జనవరి నుంచి చూసుకుంటే మాత్రం గత మూడేళ్లలో ఈసారే అత్యధికంగా స్థిరాస్తి రిజిస్ట్రేషన్లు జరిగాయని నైట్ ఫ్రాంక్ ఇండియా నివేదిక తెలిపింది. 2022 సంవత్సరంలో మొత్తం 56,046 రిజిస్ట్రేషన్లు జరగగా.. 2023లో అది 58,390కి పెరిగింది. అయితే, ఈ ఏడాది 2024లో జనవరి నుంచి అక్టోబర్ నెల వరకే అంటే 10 నెలల్లోనే 65,280 రిజిస్ట్రేషన్లు జరిగినట్లు తెలిపింది.
హైదరాబాద్ నగరంలో అక్టోబర్ నెలలో గత ఏడాది ఇదే సమయంతో పోలిస్తే రిజిస్ట్రేషన్లు స్వల్పంగా పెరిగినట్లు నైట్ ఫ్రాంక్ ఇండియా తెలిపింది. 2023 అక్టోబర్ నెలలో 5,799 ఇళ్ల రిజిస్ట్రేషన్లు జరిగాయి. ఈ ఏడాది అక్టోబర్ నెలలో 5,894 ఇళ్లు రిజిస్టర్ అయినట్లు నివేదిక తెలిపింది. ఏడాది క్రితంతో పోలిస్తే పెరుగుదల 2 శాతంగా ఉందని పేర్కొంది. అయితే, సెప్టెంబర్, 2024 నెలలో 4,903 యూనిట్లు రిజిస్టర్ కాగా.. అక్టోబర్ నెలలో 20 పెరిగి 5,894 ఇళ్లు రిజిస్టర్ అయ్యాయి.
రిజిస్ట్రేషన్ల పరంగా స్వల్పంగా పెరిగినప్పటికీ విలువ పరంగా చూస్తే 14 శాతం పెరుగుదల నమోదైందని నైట్ ఫ్రాంక్ ఇండియా నివేదిక తెలిపింది. 2023 అక్టోబర్ నెలలో రూ.3175 కోట్లు విలువైన ఆస్తులు రిజిస్ట్రేషన్ కాగా.. ఈ ఏడాది 2024 అక్టోబర్ నెలలో రూ.3617 కోట్లు విలువైన ఇళ్లు, భూములు రిజిస్టర్ అయ్యాయి. గత ఏడాదితో పోలిస్తే ధరలు పెరగడమే ఇందుకు కారణమని నివేదిక తెలిపింది. ఇక విలువ ఆధారంగా చూసుకుంటే రూ.50 లక్షల లోపు ఉండే ఇళ్ల కేటగిరీలో 2023 అక్టోబర్ నెలలో 3,831 యూనిట్లు రిజిస్టర్ కాగా.. ఈసారి అది 3,482 యూనిట్లకు తగ్గిపోయింది. 9 శాతం మేర పడిపోయింది. కానీ రూ.50 లక్షల నుంచి రూ.1 కోటి లోపు ఉండే ఇళ్ల రిజిస్ట్రేషన్లు 17 శాతం వృద్దితో 1370 నుంచి 1601 కి పెరిగాయి. రూ.1 కోటి ఆపైన విలువైన ఇళ్లు 36 శాతం వృద్దితో 598 నుంచి 811కు పెరిగాయి.
మొత్తం రిజిస్ట్రేషన్లలో 1000 నుంచి 2 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలోని ఇళ్లే ఎక్కువగా ఉన్నాయని నివేదిక తెలిపింది. ఈ కేటగిరీలో 70 శాతం విక్రయాలు జరిగినట్లు తెలిపింది. 2 వేల చదరపు అడుగులు ఆపైన ఉండే ఇళ్ల రిజిస్ట్రేషన్లు 12-14 శాతంగా ఉన్నట్లు పేర్కొంది. ఇక నగరంలోని ప్రాంతాల వారీగా చూసుకుంటే రంగారెడ్డి జిల్లాలో అత్యధికంగా 43 సాతం రిజిస్ట్రేషన్లు జరిగాయి. ఆ తర్వాత మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 41 శాతం, హైదరాబాద్ జిల్లాలో 16 శాతం రిజిస్ట్రేషన్లు జరిగాయి. ఈ ఏడాది అక్టోబర్ నెలలో జరిగిన ఇళ్ల రిజిస్ట్రేషన్లలో అత్యధిక విలువ కలిగిన వాటిని తీసుకుంటే రూ.7 కోట్లకుపైగా ఉన్నట్లు నివేదిక తెలిపింది. రాయదుర్గంలో ఒక ఇళ్లు రూ.7.69 కోట్లు, బంజారాహిల్స్‌లో రూ.7.47 కోట్లు పలికినట్లు తెలిపింది. పుప్పాలగూడలో మూడు స్థిరాస్తులు రూ.7.21 కోట్లుగా పలికినట్లు తెలిపింది.
Latest News